శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 8 ఏప్రియల్ 2017 (17:50 IST)

అసద్ విషసర్పం... అణచివేత తప్పదన్న అమెరికా... భయపడుతున్న భారత్... ఎందుకు?

కత్తులు, ఫిరంగుల కాలం వేరు. ఇప్పుడు పెను విస్ఫోటనం కలిగించే అణుబాంబులు వచ్చేశాయి. ప్రపంచ అగ్రదేశాల్లో ఏ దేశమయినా ఆగ్రహం చెంది వీటిని ప్రయోగిస్తే ప్రపంచం సర్వనాశనానికి నాంది పలికినట్లే అవుతుంది. తాజాగా సిరియాలో జరుగుతున్న దాడులు, రెండు అగ్రరాజ్యాల మధ్

కత్తులు, ఫిరంగుల కాలం వేరు. ఇప్పుడు పెను విస్ఫోటనం కలిగించే అణుబాంబులు వచ్చేశాయి. ప్రపంచ అగ్రదేశాల్లో ఏ దేశమయినా ఆగ్రహం చెంది వీటిని ప్రయోగిస్తే ప్రపంచం సర్వనాశనానికి నాంది పలికినట్లే అవుతుంది. తాజాగా సిరియాలో జరుగుతున్న దాడులు, రెండు అగ్రరాజ్యాల మధ్య చెలరేగుతున్న పరస్పర వాగ్యుద్ధం చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం వాకిట్లో ప్రపంచం వున్నదా అనే సందేహాలు కలుగుతున్నాయి. 
 
సిరియా దేశంలో చెలరేగిన అంతర్యుద్ధం ఇప్పుడు అమెరికా - రష్యాల వైరంగా మారుతోంది. అసలు సిరియా పైన అమెరికా ఎందుకు దాడి చేస్తోంది...? దాన్ని రష్యా ఎందుకు వ్యతిరేకిస్తుంది...? మన దేశం ఈ పరిణామాలతో ఎందుకు భయపడుతోంది...? వివరాల్లోకి వెళితే... సిరియా హఫెజ్‌ అల్‌ అసద్, అతని కొడుకు బషర్‌ అల్‌ అసద్‌ల నియంతృత్వ పాలన కారణంగా సిరియాలో ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. అతడి నియంతృత్వ పోకడల కారణంగా 2011లో ప్రారంభమైన అంతర్యుద్ధం ఆ దేశాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేసింది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పంజాతో సిరియా పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారింది.
 
సిరియా ప్రజలను అణిచివేతే లక్ష్యంగా అసద్ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో అతడికి మద్దతు తెలిపేవారు, వ్యతిరేకించే వర్గం తయారైంది. అతడు షియా కావడంతో ఇరాన్, తన ప్రయోజనాల మేరకు రష్యా పుష్కలంగా అతడికి మద్దతు ఇస్తూ వస్తోంది. ఆ మద్దతుతో అసద్ తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారు. అతడి చర్యలను తట్టుకోలేని ప్రజలు తిరుగుబాటు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తనను వ్యతిరేకిస్తున్న వారిని తుదముట్టించేందుకు రసాయన దాడులకు పాల్పడి అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్నారంటూ అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అసద్ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామంటూ యుద్ధ విమానాలతో దాడులు ప్రారంభించింది. అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసేటపుడు తనకు అమెరికా తప్ప ఇతర ప్రపంచ దేశాల సంగతి అనవసరం అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తన మాటను పక్కనపెట్టారు. అమాయకులను బలి చేస్తుంటే చూస్తూ వూరుకోబోమని ఆయన హెచ్చరిస్తున్నారు. అమెరికాకు మద్దతుగా సౌదీ అరేబియా నిలిచాయి. మరోవైపు సిరియా అసద్ కు రష్యా, ఇరాన్ దేశాలు కొమ్ము కాస్తున్నాయి. సిరియాలో తలెత్తిన అంతర్యుద్ధం కాస్తా రష్యా వర్సెస్ అమెరికాగా మారిపోతోంది. ఈ పరిస్థితిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముదిరితే ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని భయపడుతున్నాయి. 
 
ఇక మన దేశం విషయానికి వస్తే... సిరియాపై అటు అమెరికా ఇటు రష్యా అనుసరిస్తున్న విధానాలపై స్పందించడం లేదు. వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. మరోవైపు సిరియాలో తలెత్తిన యుద్ధం కారణంగా మన స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం వుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిరియాకు భారతదేశం 24 కోట్ల డాలర్లు ఇచ్చింది. ఇంకా పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టేందుకు అంగీకారాలు కుదిరాయి. ఐతే ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల రీత్యా మన దేశ పౌరులు అక్కడికి వెళ్లలేని పరిస్థితి. అందువల్ల తమ దేశ పౌరులకు భద్రత కల్పిస్తేనే నిర్మాణాలు చేపడుతామని భారత్ స్పష్టం చేసింది. 
 
మరోవైపు సిరియాలో తలెత్తిన ప్రజా తిరుగుబాటు కారణంగా ముడి చమురు ధరలు బాగా పెరుగుతాయి. దీనితో భారత్ పైన లక్షల కోట్ల డాలర్ల మేర భారం పడుతుంది. ఇరాక్ తర్వాత అత్యధికంగా చమురు వచ్చేది సిరియా దేశం నుండే. ఈ దేశం ఇప్పుడు ఇలా అల్లకల్లోలంగా మారుతూ వుండటంతో ప్రపంచంలో చాలా దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇండియన్ మార్కెట్లలో భయాందళోనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా సిరియా అంతర్యుద్ధం కారణంగా ఐదు లక్షల మంది మరణించారని ఐక్యరాజ్య సమితి గత ఏడాది ఆగస్టులో ప్రకటించింది. ఆ తర్వాత మరణాల సంఖ్య మరీ పెరుగుతూ వుండటంతో ఇపుడు లెక్కించడం కూడా మానేసింది. మానవాళి వినాశకర దారుల్లో కాకుండా శాంతియుత మార్గంలో పయనించాలని కోరుకోవడం తప్పించి మనం మాత్రం ఏం చేయగలం...?