శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 13 డిశెంబరు 2016 (19:45 IST)

వర్దా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పన్నీర్ సెల్వం... అమ్మ క్యాంటీన్లు ఓపెన్... సెల్వం పనితీరుకు పరీక్ష

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి... సరిగ్గా వారం క్రితమే జయలలిత పరమపదించడంతో ఆయన పగ్గాలు చేపట్టారు. మళ్లీ వారం లోపుగానే ప్రకృతి విలయతాండవం. వర్దా తుఫాన్ చెన్నై నగరాన్ని వణికించింది. సమాచార వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. ఏళ్లనాటి భారీ

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి... సరిగ్గా వారం క్రితమే జయలలిత పరమపదించడంతో ఆయన పగ్గాలు చేపట్టారు. మళ్లీ వారం లోపుగానే ప్రకృతి విలయతాండవం. వర్దా తుఫాన్ చెన్నై నగరాన్ని వణికించింది. సమాచార వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. ఏళ్లనాటి భారీ వృక్షాలు నేలకొరిగాయి. ముఖ్యంగా ఉత్తర చెన్నై దారుణంగా దెబ్బతిన్నది. రోడ్లపై భారీ వృక్షాలు అడ్డంగా పడిపోయాయి. కొన్నిచోట్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ లేకపోవడంతో తాగునీటికి కటకట ఏర్పడింది. 
 
బాధితులను భరోసా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్వయంగా బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతోపాటు విద్యుత్ శాఖామంత్రి తంగమణి కూడా పర్యటించారు. బాధిత ప్రాంతాల్లో అమ్మ క్యాంటీన్ల ద్వారా భోజనం, నీళ్లు ఉచితంగా అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో అధికారులను మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేయాల్సిందిగా పన్నీర్ సెల్వం ఆదేశించారు. ముందస్తు హెచ్చరికలతో ప్రాణ నష్టమైతే తగ్గించగలిగారు. 
 
ఐతే తుఫాను తాకిడి ప్రాంతం కనుక భారీ వృక్షాల కొమ్మలను ముందస్తుగా నరికేసి ట్రిమ్ చేసి ఉన్నట్లయితే నష్టాన్ని మరింత తగ్గించే అవకాశం ఉండేది. ఏదేమైనప్పటికీ పన్నీర్ సెల్వం బాధిత ప్రాంతాల్లో పర్యటనలు, విద్యుత్ పునరద్ధరణకు ఆ శాఖకు చెందిన మంత్రి ఎప్పటికప్పుడు విద్యుత్ అధికారులతో సమీక్షలు చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. ఒకరకంగా పన్నీర్ సెల్వం తనదైన మార్కును కనబరుస్తున్నట్లు చెప్పుకోవాలి. ఇప్పటివరకూ అన్నాడీఎంకె పార్టీ కుర్చీ కోసం జరుగుతున్న చర్చ కాస్తా తుఫాన్ నష్టం, సమీక్షల వైపుకు మళ్లింది. మరి పన్నీర్ సెల్వం చేస్తున్న సహాయక కార్యక్రమాల అనంతరం తమిళ ప్రజలు ఆయన పనితీరును ఎలా ఉందని చెపుతారో చూడాల్సి ఉంది.