శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: గురువారం, 19 ఏప్రియల్ 2018 (15:12 IST)

వచ్చే ఎన్నికల్లో టిడిపి ఓటమికి చంద్రబాబే కారణమవుతారా?

తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు పక్కచూపులు చూస్తున్నారు. అంతా బాగుంటుందనుకున్న తరుణంలో అసంతృప్తులు అసలుకే ఎసరు తెస్తాయన్న ఆందోళన క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. అవసరానికి మించి నేతలను చంద్రబాబు చేర్చుకోవడంతో వారందరినీ సంతృప్తి పరచడం అధ

తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు పక్కచూపులు చూస్తున్నారు. అంతా బాగుంటుందనుకున్న తరుణంలో అసంతృప్తులు అసలుకే ఎసరు తెస్తాయన్న ఆందోళన క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. అవసరానికి మించి నేతలను చంద్రబాబు చేర్చుకోవడంతో వారందరినీ సంతృప్తి పరచడం అధినేతకు సవాల్‌గా మారింది. దీంతో తమకు ప్రాధాన్యత తగ్గడం లేదన్న కారణం చూపుతూ చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంతమందైతే ఇప్పటికే ఇతర పార్టీల వైపు వెళ్ళిపోతున్నారని టిడిపి నేతలే చెబుతున్నారు.
 
టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత వలసలను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. జగన్ చేసిన ఛాలెంజ్‌ను సవాల్‌గా తీసుకుని అదో ఉద్యమంలా నడిపింది. నేతలు కూడా గుంపులుగుంపులుగా జాయిన్ అయిపోయారు. కానీ ఆ తరువాతే అసలు సినిమా కనిపించింది. నియోజకవర్గాల పునర్విభజన జరుగకపోవడం, పదవుల కంటే నేతలు ఎక్కువైపోవడంతో వీరందరినీ సంతృప్తిపరచడం బుజ్జగించడం సాధ్యం కాలేదు.
 
ఏదో ఊహించుకుని టిడిపిలో చేరితే ఏమీ దక్కలేదన్న అసంతృప్తిలో చాలామంది నేతలు ఉన్నారు. తమకు గౌరవం దక్కనప్పుడు పార్టీలో ఎందుకు ఉండాలన్న దిశగా వారిలో ఆలోచనలో సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, వైసిపిల నుంచి వచ్చిన నేతలు ఎక్కువగా పక్కచూపులు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి టిడిపి నుంచి వైసిపిలోకి చేరారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజధాని ప్రాంతం నుంచి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పార్టీ మారుతుంటే అధిష్టానం ఆపలేకపోయిందంటే పరిస్థితులు బాగోలేదని సీనియర్లు బాధపడుతున్నారు.
 
ఇక నెల్లూరు జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఆనం రాంనారాయణరెడ్డి కూడా వైసిపిలో చేరడానికి రెడీ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. కేవలం ప్రకటన మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఆయన్ను ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నా అవేవీ ఫలించే ప్రయత్నం కనిపించడం లేదని టిడిపి వర్గాల మాట. సిఎం చంద్రబాబు గానీ, నారా లోకేష్‌ గానీ పార్టీపై దృష్టి పెట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రతిరోజు రివ్యూలు, వీడియో కాన్ఫరెన్స్‌లలో బిజీగా ఉంటున్నారు. పార్టీ నేతలకు ఆయన్ను కలిసి రెండు నిమిషాలు సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. సిఎంను కలిసి సమస్యలు చెప్పుకోవాలంటే సమయం ఇవ్వకపోవడం దారుణమని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. 
 
ఇక కనీసం లోకేష్‌నైనా కలుద్దామనుకుంటే ఆయనా బిజీగా వుంటున్నారు. మంత్రుల దృష్టికి కొన్ని సమస్యలు వెళ్ళినా వారు అధినేతను కాదని ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పటికైనా చంద్రబాబు అధికారులతో గడిపే సమయాన్ని తగ్గించి పార్టీపైన దృష్టిపెట్టకుంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని పార్టీలోని సీనియర్లే బహిరంగంగా చెప్పుకుంటుండడం గమనార్హం.