గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 12 నవంబరు 2021 (23:27 IST)

మధుమేహం ఉన్న వాళ్లు ఎట్టి పరిస్ధితులలోను అది మానేయకూడదు

మధుమేహం అదుపులో వుంచుకోవాలంటే రోజుకి కనీసం మూడు సార్లయినా తాజా కూరగాయలు తీసుకోవాలి. క్యాబేజీ, పుదీనా, పాలకూర, కాకరకాయ, బెండకాయ, కాలీఫ్లవర్, దోసకాయ, క్యారెట్, ముల్లంగి, ఉల్లికాడలు, గుమ్మడికాయ మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి.
 
తాజా పండ్లు తినటమూ మంచిదే. వీటిలో సహజంగా ఉండే చక్కెర సుక్రోజ్ కన్నా నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయితే చాలా తీయగా ఉండే మామిడి, అరటి వంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి పండ్లను భోజనం చేసిన వెంటనే తింటే రక్తంలో గ్లూకోజ్ త్వరగా పెరుగుతుంది. 
 
మధుమేహం ఉన్న వాళ్లు ఎట్టి పరిస్ధితులలోను ఆహారం తినటాన్ని మానేయటం మంచిదికాదు. ప్రతిరోజు ఒకే సమయంలో భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. కేకులు, మిఠాయిలు, చాక్లెట్లు వంటి అధిక చక్కెర గల పదార్ధాలకు దూరంగా ఉండాలి. తీయటి పానీయాల జోలికి వెళ్లకపోవటం మంచిది.
 
ఎక్కువ నూనెతో వేయించే పదార్ధాలకన్నా ఉడికించినవి తినటం ఎంతో మంచిది. అలాగే అన్నం, ఆలుగడ్డ, అరటి వంటివి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటివి పెద్దమెుత్తంలో తినకుండా చూసుకోవాలి. మధుమేహులకు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం అన్ని విధాలా మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా రోజులో ఎప్పుడైనా సరే .. ఆహారాన్ని ఒకేసారి పెద్దమెుత్తంలో తినకుండా జాగ్రత్తపడాలి.