వామ్మో... ఆబోతులా ఆ గురక ఏంట్రా బాబూ... ఆపేదెట్లా?
గురక. నిద్రలో రకరకాల శబ్దాలు చేస్తుంటారు. గురక పెడుతుంటే ఆ శబ్దం ఎంతో చికాకు కలిగిస్తాయి. కానీ గురక పెట్టేవారు మాత్రం హాయిగా నిద్రపోతుంటారు. ఈ గురకకు నిరోధించాలంటే ఈ చిట్కాలు పాటించండి. సగటు బరువున్న వ్యక్తుల కంటే అధిక బరువున్న వారే ఎక్కువగా గురక పెడుతుంటారు. మెడ చుట్టూ పేరుకున్న కొవ్వు వాయునాళంపై ప్రభావం చూపుతుంది. అందుకే, బరువు తగ్గడంపై దృష్టిపెట్టాలి.
అధిక మద్యపానం కూడా గురకకు కారణం అవుతుంది. దవడ కిందికి జారి, గొంతు భాగం పట్టేసినట్టవడంతో ధ్వనులు వెలువడతాయి. అలాగే గురక పెట్టే వ్యక్తులకు ధూమపానం అలవాటు ఉంటే, వెంటనే స్వస్తి చెప్పడం మంచిది. పొగతాగడం ద్వారా శ్వాస వ్యవస్థ ఏస్థాయిలో ప్రభావితమవుతుందో తెలియంది కాదు.
కొన్ని సందర్భాల్లో అలర్జీలు వల్ల గురక వస్తుంది. ఇలాంటి వ్యక్తుల్లో నోరు తెరిచి నిద్రపోవడం మూలంగా గురక వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మూలకారణమైన అలర్జీకి చెక్ పెడితే ఇలాంటి వ్యక్తుల్లో గురక కనిపించదు.
వెల్లకిలా కానీ, బోర్లా కానీ పడుకున్నప్పుడే ఈ గురక ఎక్కువగా వస్తుంటుంది. అందుకే, పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక వేళ మీరు నిద్రపోయిన తర్వాత, పక్కకు తిప్పమని మీ భాగస్వామికి ముందే చెప్పాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.