చాలామంది యువకులు చూసేందుకు చాకుల్లా వుంటారు కానీ అక్కడ డకౌట్... లెక్కలివే...
చూసేందుకు చాలామంది యువకులు చాకుల్లా ఉంటారు. కానీ, పడక గదిలోకి వెళ్లగానే తుస్ మంటారు. ఇలాంటివారిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. పెరుగుతున్న జీవనశైలితో పాటు ఉద్యోగ ఒత్తిడి కారణంగా ఐటీ ఉద్యోగులు శృంగార సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. దీంతో, మానసికంగా మరింత కుంగిపోతున్నారు.
చిన్న వయసులోనే విపరీతమైన ఒత్తిళ్లు, జీవనశైలి యువతలో ఆ సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఆరంకెల జీతాలతో యువత ఆర్థికంగా పటిష్టంగా ఉంటున్నా సంసారం మాత్రం బీటలు వారుతోంది. భార్యాభర్తలిద్దరూ కష్టపడుతున్నారు. కానీ, వారికి పడక సుఖం కరువవుతోంది. వెరసి, శృంగార సామర్థ్యం తగ్గుతున్న వాళ్లు కొందరు అయితే, లైంగిక ఆసక్తి లేనివాళ్లు మరికొందరు.
ఇటీవలికాలంలో యువతీయువకుల్లో శృంగారేచ్ఛ గణనీయంగా తగ్గుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. గతంలో శృంగార సమస్యతో వచ్చే మగవారి వయసు సగటున 40 ఏళ్లుగా ఉండేదని.. ఇప్పుడు 25 యేళ్ల నుంచి 35 ఏళ్ల లోపువారు కూడా ఆ సమస్యతో తమను సంప్రదిస్తున్నారని అంటున్నారు. ఒకవైపు ఆఫీసులో పని.. ఇంటికి వచ్చాక ఇంటి పని రెండింటినీ సమతుల్యం చేయలేక తీవ్ర అలసటకు గురవుతున్న మహిళల్లో కూడా ఆసక్తి తగ్గుతోందని వారు చెపుతున్నారు.
ఇలాంటి సమస్యను అధికంగా ఎదుర్కొంటున్న వారిలో ఐటీ ఉద్యోగులే ఉన్నారు. విపరీతమైన పోటీ, ఒకేసారి రెండుమూడు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి రావడం, భిన్న స్వభావాలున్న క్లయింట్లను మెప్పించాల్సి రావడం, వేళాపాళా లేకుండా పని చేయడం, గంటలు, రోజుల తరబడి ఆఫీసులోనే అతుక్కుపోవడం, ఎప్పుడంటే అప్పుడు భోజనం చేయడం తదితర వంటి సమస్యల కారణంగా శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడమే కాకుండా ఆసక్తి వున్నవారిలో కూడా సామర్థ్యం కోల్పోతున్నట్టు తేలింది.
మానసిక సమస్యలకు తోడు వ్యాయామం లేకపోవడం, మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లు ఉంటే, అటువంటి వారి పరిస్థితి మరీ దుర్భరంగా మారుతోందని వివరిస్తున్నారు. ఫలితంగా, ఉద్యోగుల్లో జీవనశైలి జబ్బులు పెరిగిపోతున్నాయని, యువతుల్లో ఊబకాయం, హార్మోన్ సమస్యలు, యువకుల్లో వీర్యకణాల లోపం సంతాన లేమి సమస్య పెరగడానికి ప్రధాన కారణాలని చెబుతున్నారు.