శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (14:56 IST)

పెయిన్ కిల్లర్‌గా పారాసిటమాల్ వాడుతున్నారా? కాలేయం పాడైపోవచ్చు...!!

tablets
చాలా మంది చిన్నపాటి జ్వరానికి లేదా చిన్నచిన్న శరీర నొప్పుల కోసం పారాసిటమాల్ మాత్రలను వినియోగిస్తుంటారు. ఈ తరహా చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఈ మాత్రం అద్భుతంగా పని చేస్తుంది కూడా. అయితే, అదేపనిగా ఈ మాత్రను వాడటంపై వైద్య పరిశోధకులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఈ మాత్రలను పొద్దస్తమానం వినియోగిస్తే అనారోగ్య సమస్యలతో పాటు శరీర అవయవాలు దెబ్బతింటాయని వారు పేర్కొంటున్నారు. 
 
ఇదే అంశంపై ఎడిన్బరో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో విస్తుపోయే విషయం ఒకటి వెల్లడైంది. ఎలుకలకు అదే పనిగా పారాసిటమాల్ ఇస్తూ వాటిలో కలిగే మార్పులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలేయం దెబ్బతిన్నట్టు గుర్తించారు. పారాసిటమాల్ అధికమోతాదులో తీసుకునే రోగుల్లోనూ ఇదే ఫలితం కనిపిస్తుందని హెచ్చరించారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నవారు రోజుకు 4 గ్రామల వరకు పారాసిటమాల్ తీసుకోవడం వరకు ఓకే అని, కానీ అంతకుమించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యాన్ని పణంగాపెట్టడమే అవుతుందని తెలిపారు.
 
పారాసిటమాల్ మందు అవయవాల్లోని కీలకమైన నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాలేయం, ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని పారాసిటమాల్ దెబ్బతీస్తున్నట్టు పరిశోధనలో వెల్లడైనట్టు పేర్కొన్నారు. పారాసిటమాల్ కారణంగా కాలేయం దెబ్బతింటుందని గుర్తించిన మొదటి అధ్యయనం ఇదే. ఎడిన్‌బరో యూనివర్సిటీతోపాటు ఓస్లో, స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సర్వీస్ పాల్గొన్న ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.