శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (21:24 IST)

వాముకి వున్న పవర్ తెలిస్తే ఈ రోజుల్లో తీసుకోవాల్సిందే... (video)

వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాముతో తలనొప్పి, ముక్కు దిబ్బడ, తలదిమ్ము వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా మరిన్ని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.
 
ఒక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి నీళ్లుపోసి వేడి చేయండి. దీనికి ఒక టేబుల్ స్పూన్ దంచిన వామును కలపండి. దీనినుంచి వచ్చే ఘాటు ఆవిరిని గాఢంగా పీల్చితే జలుబు వల్ల ఏర్పడిన ముక్కుదిబ్బడ తొలగిపోతుంది.
 
అర లీటర్ మరిగే నీళ్లకు ఒక టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపు చూర్ణాన్ని కలిపి చల్లార్చండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే, జలుబు ఛాతిలో కఫం పేరుకుపోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.
 
అర టీ స్పూన్ వామును, రెండు లవంగాలను, ఒక చిటికెడు ఉప్పును కలిపి చూర్ణించి అరకప్పు వేడి నీళ్లకు కలిపి కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.
 
రెండు టీ స్పూన్ల వామును మెత్తగా దంచండి. ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి.
 
వాము చూర్ణాన్ని రెండునుంచి మూడు గ్రాములు వేడి నీళ్లలో గాని లేదా వేడి పాలతో గాని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే జలుబు, తలనొప్పి, పడిశము వంటివి తగ్గుతాయి.
 
ఒక గుప్పెడు వామును కచ్చాపచ్చాగా దంచి ఒక కాటన్ దస్తీలో మూటకట్టండి. దీనిని పిల్లలు పడుకునే దిండు పక్కను వుంచండి. దీని నుంచి వచ్చే ఘాటు వాసనకు పసి పిల్లల్లో ముక్కుదిబ్బడ తొలగిపోతుంది.
 
ఒక గుప్పెడు వామును కాటన్ గుడ్డలో మూటగా చుట్టండి. దీనిని ఒక పెనం మీద వేడి చేయండి. ఆ తర్వాత కాస్త వేడిమి తగ్గాక తడిమి చూసి ఛాతిమీద మెడమీద ప్రయోగిస్తే ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.