ఆ సమస్య వున్నవారు ఇవన్నీ తీసుకుంటే మంచిది...
ప్రస్తుతకాలంలో తినే ఆహారం సరైనది కాకపోవడం, సమయానికి తినకపోవడం, మసాలా, నూనె పదార్దాలు లాంటివి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక మలబద్దక సమస్య తలెత్తుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు తోడ్పడే అవయవాలను జీర్ణావయవాలంటారు. ఇది సరిగ్గా పని చేయకపోతే మలబద్దకం, విరేచనాలు కలుగుతాయి. మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఆహార నియమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటంటో చూద్దాం.
1. తీసుకునే ఆహారంలో పీచు పదార్దాలు ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అంటే... ఆకుకూరలు, కూరగాయలు సమృద్దిగా తీసుకోవాలి.
2. క్యారెట్, దోస వంటి కూరగాయలను తాజా పండ్లను పచ్చిగానే తినడం వల్ల ఎక్కువ పీచు పదార్దాన్ని ఆహారం నుండి పొందవచ్చు.
3. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది.
4. పండ్ల రసాలు త్రాగడం తగ్గించి, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. బత్తాయి తినేటప్పుడు తెలుపు పొరతోనే తొనలు తినాలి.
5. కాఫీ, టీ, కారం, మసాలా దినుసులు, వేపుడు కూరలు ఆహారంలో బాగా తగ్గించాలి.
6. ముడిధాన్యాలు, ముడిపప్పులను వాడాలి. మొలకెత్తించిన ముడిపప్పులు శ్రేష్టమైనవి. జల్లించకుండా తవుడు కొద్దిగా గల గోధుమ పిండి లేక జొన్న పిండిని రొట్టెలు చేసుకుని తినడం వల్ల మలబద్దక సమస్యను తగ్గించుకోవచ్చు.
7. వీటితో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం. వేకువ జామున ఒక గంట నడక చాలా మంచిది.