శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (09:20 IST)

సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. ఆపరేషన్ కావేరీ సక్సెస్

operation cauvery
అంతఃకలహాలు, ఘర్షణలతో అట్టుడికిపోతున్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరీని ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌‍లో భాగంగా, ఆరో విడత తరలింపు చర్యల్లో మరో 128 మంది భారతీయులు సౌదీలోని జెడ్డాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. సౌదీకి చేర్చిన వారిని త్వరలోనే భారత్‌కు తరలిస్తామని ఆయన వెల్లడించారు. 
 
సూడాన్ నుంచి భారతీయుల తరలింపునకు ఉద్దేశించిన ఆపరేషన్ కావేరీలో భాగంగా, గురువారం ఉదయం మరో 128 మంది ప్రయాణికులతో భారతీయులు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఆరో విడత తరలింపులో భాగంగా వీరు భారత వాయుదళానికి చెందిన సీ130జే రకం విమానంలో జెడ్డా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటివరకు సుమారు 1100 మంది భారత పౌరులను సూడాన్ నుంచి జెడ్డాకు తరలించారు. ఈ విషయాన్ని మంత్రి మురళీధరన్ తెలిపారు. 
 
ఈ ఆపరేషన్‌ను ఆయనే పర్యవేక్షిస్తూ జెడ్డాలోనే ఉంటున్నారు. మిగతా వారిని కూడా వీలైనంత త్వరగా సూడాన్ నుంచి తొలగిస్తామని చెప్పారు. సైనిక దళాల హింసాత్మక ఘర్షణలతో సూడాన్ అట్టుడికిపోతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 450 మంది ప్రామాలు  కోల్పోగా, 4 వేల మంది పైచిలుకు వ్యక్తులు గాయపడ్డారు. కాగా, సూడాన్‌లో చిక్కుకున్న విదేశీయుల తరలింపునకు వీలుగా సైనిక దళాలు 72 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించాయి. దీంతో వివిధ దేశాలు తమ పౌరులను స్వదేశాలకు తరలిస్తున్నాయి.