శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (11:15 IST)

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌‍కు ఏపీ కేబినెట్ ఆమోదం.. 4 నెలలకు రూ.96 వేల కోట్లు!!

buggana rajendranath reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. మరో నాలుగు నెలలకు గాను ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నాలుగు నెలల కోసం ఏకంగా రూ.96 వేల కోట్ల దాకా బడ్జెట్‌ను ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. నిజానికి ఏపీ అసెంబ్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. దీంతో నాలుగు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూపొందించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రిమండలి.. బడ్జెట్‌కు లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. ఉదయం 11 గంటలకు ఈ బడ్జెట్‌ను విత్తమంత్రి బుగ్గన్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రతులకు మంత్రి బుగ్గన తన చాంబర్‌లో పూజలు చేశారు. 
 
అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఆర్థిక ఏడాదికి ప్రభుత్వం రూ.2.86 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ అంచనా వేసింది. అయితే, ప్రభుత్వ గడువు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండడం, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఈ నాలుగు నెలల కాలానికి ప్రభుత్వం రూ.96 వేల కోట్ల దాకా బడ్జెట్ ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం.
 
మరోవైపు, సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న కారణంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులను స్వీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వీరిలో బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, బెందళం అశోక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, రామరాజు, డోలా బాల వీరాంజనేయులు, వెంకట రెడ్డి నాయుడు, నిమ్మకాయల చిన్న రాజప్ప తదితరులు ఉన్నారు. టీడీపీ సభ్యులు మంగళవారం కూడా సస్పెండ్ అయిన విషయం తెల్సిందే. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. పేపర్లను చింపి స్పీకర్‌పై విసిరాలు. అయినప్పటికీ అధికార వైకాపా సభ్యులు నిమ్మకునీరెత్తినట్టుగా మిన్నకుండిపోయారు.