రాజమండ్రి సెంట్రల్ జైలు తాత్కాలిక ఇన్‌చార్జ్‌గా మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి బంధువు!
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న అధికారిని వైకాపా ప్రభుత్వం బదిలీ చేసి ఆయన స్థానంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువైన డీఐజీ రవి కిరణ్‌ను సూపరింటెండెంట్‌గా నియమించింది. జైల్లో ఉన్న తన తండ్రిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేసేందుకే వైకాపా నేత బంధువును సూపరింటెండెంట్‌గా నియమించారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. దీనిపై డీఐజీ రవి కిరణ్ స్పందంచారు.
అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులతో సంబంధం ఉంటుందన్నారు. అంతమాత్రా అందరూ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తారనడం సరికాదన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే తనను నియమించారనే ఆరోపణలు అసత్యమన్నారు. చంద్రబాబు భద్రతపై నారా లోకేశ్ అనుమానాలను వ్యక్తం చేయడం వల్లే తనకు సెంట్రల్ జైలు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా తాత్కాలిక బాధ్యతలను అప్పగంచారని చెప్పారు. నిబంధనల మేరకు చంద్రబాబుతో ములాఖ్ కోసం ఆయన భార్య భువనేశ్వరి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించామని తెలిపారు. చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పెంచాలని కోరుతూ లోకేశ్ లేఖ రాయడం వల్ల ఈ నెల 12వ తేదీ రాత్రిపూట జైల్లో రౌండ్ వేశానని చెప్పారు.