బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (14:50 IST)

కోవిడ్ టీకా పేటెంట్ల నుంచి భారత్‌కు మినహాయింపు : అమెరికా

కోవిడ్‌ మహమ్మారి కోరల్లో చిక్కుకుని పోరాడుతున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇందులోభాగంగా, తాజాగా కొవిడ్‌ టీకా పేటెంట్ల మినహాయింపుపై చేస్తున్న పోరాటంలో భారత్‌కు అత్యంత కీలక భాగస్వామి నుంచి మద్దతు లభించింది. 
 
కొవిడ్‌ టీకాకు పేటెంట్ల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వాదనకు బుధవారం అమెరికా మద్దతు పలికింది. పేద దేశాల ప్రజలు ప్రాణాలు నిలుపుకొనేందుకు అవసరమైన టీకాల లభ్యత పెంపుపై ఈ అంశం ఆశలు పెచ్చింది.
 
అమెరికా ట్రేడ్‌ ర్రిప్రజెంటేటీవ్‌ కేథరిన్‌ టై బుధవారం మాట్లాడుతూ ‘‘వ్యాపారాలకు మేధో హక్కుల రక్షణ అత్యంత కీలకమైందే. కానీ, కొవిడ్‌ టీకాకు సంబంధించి మాత్రం ఇటువంటి రక్షణను తొలగించాలన్న వాదనకు అమెరికా మద్దతు పలుకుతోంది. 
 
కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి అనేది అంత్యంత అసాధారణ సందర్భం. ఇలాంటి స్థితిలో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలి. టీకాల తయారీ, పంపిణీకి సంబంధించిన వ్యవస్థలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తాము. టీకాల తయారీకి అవసరమైన ముడిపదార్థాల ఉత్పత్తిని పెంచుతాము’’ అని ఆమె పేర్కొన్నారు. 
 
అమెరికా నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డీజీ ట్రెడ్రోస్‌ అథానోమ్‌ గెబ్రియోసిస్‌ స్వాగతించారు. అమెరికా నిర్ణయం చారిత్రకమని ఆయన వ్యాఖ్యానించారు. కొవిడ్‌పై పోరులో ఇదొక మైలురాయిగా నిలుస్తుందన్నారు. 
 
ఇదిలావుంటే, టీకాల మేధో హక్కులపై మినహాయింపులు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై భారీ ఒత్తిడి ఉంది. ముఖ్యంగా సంపన్న దేశాలు టీకాలపై గుత్తాధిపత్యం చూపుతున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ దిశగా బైడెన్‌ కార్యవర్గం అడుగులు వేస్తోంది.