సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జూన్ 2024 (12:13 IST)

ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దు : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సూచన

elon musk
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించవద్దని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సూచించారు. పోలింగ్ సమయంలో ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురికావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించొచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
'మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది' అని మస్క్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్యూర్టో రికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు. 
 
అలాగే, యూఎస్‌ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ ఈ హ్యాకింగ్‌పై మాట్లాడుతూ 'ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరి ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటుచేసుకొన్నాయి. పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగాము. లేదంటే ఏమి జరిగేదో.. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలి, అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుంది' అని పేర్కొన్నారు.