ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (09:13 IST)

అగ్రరాజ్యంలో రణరంగం : ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్ .. మద్దతుదారుల కాల్పులు

అగ్రరాజ్యం అమెరికాలో చిచ్చు రాజుకుంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫేస్‌బుక్, ట్విట్టర్ యాజమాన్యాలు షాకిచ్చాయి. ట్రంప్ ఖాతాను ట్విట్టర్ లాక్ చేయగా, ఆయన చేసిన పోస్టును ఫేస్‌బుక్ తొలగించింది. 
 
అమెరికా క్యాపిటల్ భవనంలోకి ట్రంప్ మద్దతుదారులు దూసుకెళ్లి గలాబా సృష్టించిన తర్వాత ట్రంప్ చేసిన ట్వీట్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ట్విట్టర్ నియమాలకు విరుద్ధంగా చేసిన ట్వీట్లను తొలగించాలంటూ ట్రంప్‌ను ట్విట్టర్ కోరింది. తొలగించకుంటే ఖాతాను లాక్ చేస్తామన్న ట్విట్టర్... మూడు ట్వీట్లను తొలగించింది.
 
మరోవైపు, ఫేస్‌బుక్ కూడా ట్రంప్ వీడియో సందేశాన్ని తొలగించింది. క్యాపిటల్ భవనంలో ఘటన నేపథ్యంలో సంయమనం పాటించాలంటూ ట్రంప్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోను తొలగించిన ఫేస్‌బుక్ ట్రంప్ మద్దతుదారుల ఆందోళన నేపథ్యంలోనే దీనిని తొలగించినట్టు వివరణ ఇచ్చింది.
 
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికకు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున క్యాపిటల్ భవనం (కాంగ్రెస్ సభ్యుల సమావేశ మందిరం)లోకి దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించిన క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. 
 
ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ఆయన గెలుపును ధ్రువీకరించేందుకు అమెరికన్ కాంగ్రెస్ సమావేశమైంది.
 
అయితే, బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తున్న ట్రంప్ మద్దతుదారులు నినాదాలు చేసుకుంటూ క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. 
 
ఆందోళనకారులపైకి పోలీసులు బాష్పవాయువును కూడా ప్రయోగించారు. కాల్పుల్లో ఓ మహిళ మెడలోకి తూటా దూసుకుపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
 
మరోవైపు, ఈ ఘర్షణతో బైడెన్ గెలుపును ధ్రువీకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. ట్రంప్ ఆదేశాలతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపు చేశాయి. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.