బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (15:17 IST)

అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడం మంచిది : హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ

joe biden
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడం మంచిదని హాలీవుడ్ నటుడు, డెమోక్రాటిక్ మద్దతుదారుడు జార్జ్ క్లూనీ అభిప్రాయపడ్డారు. జో బైడెన్ ఈ సారి గెలవడం కష్టమేనని ఆయన జోస్యం చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బైడెన్‌ను చూశాక గెలుపుపై తనకు ఆశలు సన్నగిల్లాయని చెప్పారు. పార్టీకి పెద్దఎత్తున నిధులు సమకూర్చే వారిలో క్లూనీ కూడా ఉన్నారు. అంతేకాదు, జో బైడెన్‌కు క్లూనీ అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన వ్యాఖ్యలు తాజాగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. 
 
డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ బరిలోకి దిగితే ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు విజయం నల్లేరు మీద నడకలా మారుతుందని హెచ్చరించారు. ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ డెమోక్రాటిక్ పార్టీ పట్టుకోల్పోతుందని క్లూనీ ఆందోళన వ్యక్తం చేశారు. బైడెన్ గెలుపుపై పార్టీలో ఎవరికీ ఆశలు లేవని క్లూనీ చెప్పారు. చట్ట సభ్యులు, గవర్నర్లు అందరూ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని క్లూనీ తెలిపారు. 
 
వారందరితో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, బైడెన్ తప్పుకుంటేనే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారని చెప్పుకొచ్చారు. సెనేటర్, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, ఓ స్నేహితుడిగా బైడెన్ను తాను ఎంతో ప్రేమిస్తానని క్లూనీ చెప్పారు. గడిచిన నాలుగేళ్ల పాలనలో అనేక ఆటుపోట్లను బైడెన్ సమర్థంగా ఎదుర్కొన్నారని అన్నారు. అయితే, ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్ రెండోసారి గెలుస్తారని క్లూనీ ఆందోళన వ్యక్తంచేశారు.