1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మే 2024 (13:56 IST)

ఆ దేశంలో ఎర్రటి లిప్‌స్టిక్‌పై నిషేధం.. కిమ్ జాంగ్ ఉన్న ఉత్తర్వులు

ఉత్తర కొరియా నియంత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు వినగానే కఠిన చట్టాలే గుర్తుకు వస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం శాసిస్తుంటారు. సౌందర్య ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తులు, చివరకు హెయిర్ స్టైల్ కూడా ఆంక్షలు విధించి అమలు చేస్తుంటారు. తాజాగా మహిళలు రెడ్ లిపిస్టిక్ వాడొద్దనే మరో నిబంధనను తీసుకొచ్చారు.
 
రెడ్ లిప్‌స్టిక్‌ను ఉత్తర కొరియా అధినాయకత్వం పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా భావిస్తోంది. అది కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని వారి నమ్మకం. ఇప్పటికే ఆ దేశంలో మేకప్‌పై నిషేధం ఉంది. దీన్ని అక్కడి ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తుంది. వీటన్నింటినీ అనుమతిస్తే ప్రజలు క్రమంగా పాశ్చాత్య దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారని కిమ్ భయం! ప్రజలు నిరాడంబరంగా, సహజంగా ఉండాలని కిమ్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. లిపిక్ వేసుకోవడం కొరియా నియమాలకు విరుద్ధమని అక్కడి నాయకుల భావన. 
 
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అనేక ఫ్యాషన్ బ్రాండ్లపై ఉత్తర కొరియాలో నిషేధం కొనసాగుతోంది. శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉండే నీలిరంగు జీన్స్, ఆభరణాలు, కొన్ని రకాల హెయిర్ స్టైళ్లపై నిషేధం ఉంది. మహిళలు, పురుషులు ప్రభుత్వం అనుమతించిన విధానంలోనే జుట్టును కత్తిరించుకోవాలి. ఇంకొన్ని నిబంధనలనైతే.. కిమ్ తనను ఎవరూ అనుకరించొద్దనే ఉద్దేశంతో అమలు చేస్తున్నారు. ఆయన తరహాలో జుట్టును కత్తిరించుకోవడం, నలుపు రంగు ట్రెంచ్ కోట్లు ఎవరూ ధరించొద్దనే నిబంధన ఉంది.