శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (10:46 IST)

ఆరు దశాబ్దాల క్యాస్ట్రో కుటుంబ పాలనకు చరమగీతం...

లాటిన్ అమెరికా దేశాల్లో ఒకటైన క్యూబాలో కమ్యూనిస్టు పాలన కొనసాగుతోంది. ఈ దేశంలో గత ఆరు దశాబ్దాలుగా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. అదీ కూడా క్యాస్ట్రో కుటుంబీకులు. ఈ కుటుంబీకుల పాలనకు గురువారంతో తెరపడ

లాటిన్ అమెరికా దేశాల్లో ఒకటైన క్యూబాలో కమ్యూనిస్టు పాలన కొనసాగుతోంది. ఈ దేశంలో గత ఆరు దశాబ్దాలుగా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. అదీ కూడా క్యాస్ట్రో కుటుంబీకులు. ఈ కుటుంబీకుల పాలనకు గురువారంతో తెరపడింది.
 
నిజానికి ఫిడేల్‌ క్యాస్ట్రో అనంతరం 12 సంవత్సరాల క్రితం దేశాధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరుడు రౌల్‌ క్యాస్ట్రో స్వీకరించారు. ఈయన తాజాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో క్యూబా కొత్త అధ్యక్షుడిగా గురువారం కమ్యూనిస్టు అగ్రనేత మిగ్వెల్‌ డియాజ్‌ కానెల్‌(58) ఎన్నికయ్యారు. 
 
ప్రస్తుత అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రో స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. క్యాస్ట్రో కుటుంబేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నికవడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. కానెల్‌ 2013 నుంచి క్యూబాకు తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. బుధవారం ఆయన్ని జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఫిడేల్‌ అనారోగ్యానికి గురికావడంతో 2006లో రౌల్‌ అధికారం చేపట్టారు.
 
అయితే క్యూబా కమ్యూనిస్టు పార్టీ అధినేతగా కొనసాగనున్న రౌల్‌ పర్యవేక్షణలోనే కానెల్‌ పాలన సాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిన్నచిన్న ప్రైవేట్‌ సంస్థలను దేశంలోకి ఆహ్వానించడం, చిరకాల ప్రత్యర్థి అమెరికాతో సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలను ముందుకుతీసుకెళ్లడం కానెల్ ముందున్న ప్రధాన సవాళ్లు. 
 
ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత కానెల్‌ కొంతకాలం ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌‌గా పనిచేశారు. తర్వాత కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరారు. మితవాదభావాలతో ప్రశాంతంగా కనిపించే కానెల్‌.. క్యూబా రెబెల్స్, అమెరికాపై మాత్రం తీవ్రస్వరంతో స్పందించేవారు.