సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (17:33 IST)

హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో మృతదేహాల అవయవాలతో వ్యాపారం...

deadbody
అమెరికాలోని ప్రసిద్ధిగాంచిన మెడికల్ స్కూల్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. వైద్య పరిశోధనల్లో భాగంగా మార్చురీకి తీసుకువచ్చిన మృతదేహాల అవయవాలతో వ్యాపారం చేస్తున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. పరిశోధనల కోసం విరాళంగా వచ్చిన మృతదేహాలను ముక్కలుగా చేసి.. తల, మెదడు, చర్మం, ఎముకలను తస్కరించి, ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు తేలింది. ఆ మార్చురీకి మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తే ఈ వికృత వ్యాపారం కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
 
వైద్య కళాశాలకు విరాళంగా వచ్చే మృతదేహాలపై మెడిసిన్‌ విద్యార్థులు ప్రాక్టికల్స్‌ చేస్తుంటారు. అలా కొంతకాలం వినియోగించుకున్న తర్వాత వాటిని దహనం/ఖననం చేయడమో లేదా ఆయా కుటుంబాలకు అప్పగించడమో జరుగుతుంది. అయితే, ఇలా విరాళంగా వచ్చే మృతదేహాలపై హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో మార్చురీ మేనేజర్‌గా ఉన్న సెడ్రిక్‌ లాడ్జ్‌ కన్నుపడింది. 
 
మృతదేహాల భాగాలను తస్కరించి గాఫ్స్‌టౌన్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. అనంతరం భార్య, మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో వాటిని విక్రయించేవాడు. ఏ శరీర భాగాలు అవసరం అవుతాయని గుర్తించేందుకు ఆ ఇద్దరు వ్యక్తులను అప్పుడప్పుడు మార్చురీలోకి అనుమతించేవాడు. ఇలా 2018 నుంచి 2022 మధ్యకాలంలో సాగిన ఈ వ్యవహారం.. దేశవ్యాప్తంగా ఓ నెట్‌వర్క్‌లా మారినట్లు సమాచారం. 
 
నాలుగేళ్ల కాలంలో లక్ష డాలర్ల వరకు లావాదేవీలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఓ స్టోర్‌ నిర్వహిస్తున్న మహిళ వాటిని కొనుగోలు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా ఎఫ్‌బీఐ.. సెడ్రిక్‌ లాడ్జ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. 
 
అయితే, ఇటీవల ఆయనపై ఆరోపణలు రావడంతో మే 6వ తేదీనే హార్వర్డ్‌ యాజమాన్యం మేనేజర్‌పై వేటు వేసింది. తమ క్యాంపస్‌లో భారీ ఆందోళన కలిగించే విషయం ఏదో జరుగుతోందనే అనుమానం కలిగిందని హార్వర్డ్‌ యూనివర్సిటీ మెడిసిన్‌ విభాగం డీన్‌ జార్జ్‌ డేలీ వెల్లడించారు. ఇప్పటికే ఎఫ్‌బీఐ ఆ ముఠాను అరెస్టు చేసి, దర్యాప్తు జరుపుతోందని తెలిపారు.