భారతీయుల తరలింపునకు ఆపరేషన్ దేవిశక్తి
ఆప్ఘనిస్థాన్ దేశం తాలిబన్ తీవ్రవాదుల వశమైంది. దీంతో ఆ దేశంలోని ఆప్ఘన్ పౌరులతో పాటు.. ఇతర దేశాలకు చెందిన పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ రాజధాని కాబూల్‌లోని విమానాశ్రయం నుంచి ప్రజలను తరలించేందుకు భారత్ చర్యలు చేపట్టింది. ఆపరేషన్ దేవిశక్తి పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.
ఈ రోజు భారతీయులు సహా మొత్తం 78 మందిని కాబూల్ నుంచి తజకిస్థాన్‌లోని దుషన్బే మీదుగా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ చేపడుతోన్న భారత వైమానిక సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారులను ఆయన ప్రశంసించారు. ఆపరేషన్ దేవి శక్తి కొనసాగుతోందని చెప్పారు. దుషన్బే నుంచి భారత్ కు 25 మంది భారతీయులు సహా 78 మంది విమానంలో బయలుదేరిన వీడియోను ఓ అధికారి పోస్ట్ చేశారు.
మరోపక్క, ఆఫ్ఘన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ గజిని ప్రావిన్స్ గేటును తాలిబన్లు కూల్చివేశారు. ఇందుకు సబంధించిన వీడియో బయటకు వచ్చింది. అలాగే, కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం ఒకటి హైజాక్‌కు గురైంది.