ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో మునిగిన థాయ్‌లాండ్ యుద్ధనౌక
థాయ్‌లాండ్‌కు చెందిన భారీ యుద్ధనౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై 31 మంది గల్లంతయ్యారు. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో సముద్రతీరానికి 20 నాటికన్ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంఎస్ సుఖోథాయ్ యుద్ధ నౌక సోమవారం సాయంత్రం మునిగిపోయింది.
ఈ యుద్ధ నౌక గస్తీలో నిమగ్నమైవుండగా, బలమైన ఈదురుగాలులు వీయడంతో ఓ చిగురుటాకులా వణికిపోయింది. అదేసమయంలో ఓడలోకి నీరు వచ్చి చేరింది. ఈ నీటికి బయటకు పంపే ప్రయత్నం సిబ్బంది చేసినప్పటికి ఆ చర్యలు ఫలించలేదు. పైగా, నౌకలోకి నీటి పోటు అధికం కావడంతో అది మునిగిపోయింది.
ఈ నౌక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాయల్ నేవీ బోట్లు, హెలికాఫ్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని నౌకలో 106 మంది సిబ్బందిలో 75 మందిని రక్షించారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలో నౌక అర్థరాత్రి సమయంలో పూర్తిగా నీటిలో మునిగిపోయింది. గల్లంతైన వారిని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నట్టు రాయల్ నేవీ అధికార ప్రతినిధి అడ్మిరల్ ఫోకరోంగ్ మోంథపలిన్ వెల్లడించారు.