సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (12:51 IST)

పార్కింగ్ చేసిన స్కూలు బస్సులో కొండ చిలువ.. ఆదివారం కావడంతో తప్పిన ముప్పు

python in bus
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే దృశ్యం ఒకటి కనిపించింది. పార్కింగ్ చేసిన స్కూలు బస్సులోకి భారీ కొండ చిలువ ఒకటి దాక్కుంది. దీన్ని గమనించిన స్కూలు సిబ్బంది పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులతో పాటు అగ్నిమాపకదళ సిబ్బంది, అటవీ సిబ్బంది వచ్చి ఆ కొండ చిలువను తాళ్ళతో బంధించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలిలో ఈ ఘటన జరిగింది. పైగా, ఆదివారం కావడంతో స్కూలు బస్సు పార్కింగ్ చేశారు. 
 
స్థానికంగా ఉండే ర్యాన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సులో ఈ కొండ చిలువ కనిపించింది. ఈ బస్సును డ్రైవర్ తన ఇంటి సమీపంల పార్క్ చేశాడు. బస్సులోకి దూరిన ఈ కొండచిలువ అందులో తిష్టవేసింది. దీన్ని గమనించిన డ్రైవర్, స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే, ఆ ప్రాంత సర్కిల్ అధికారి వందన సింగ్, సిటీ మేజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు. కొండచిలువను గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి అరగంట పాటు కష్టపడి ఒడుపుగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. బస్సులో దాక్కున్న కొండచిలువను బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 
రక్షించిన కొండ చిలువ పదకొండున్నర అడుగుల పొడవు, 80 కేజీల బరువు ఉన్నట్టు అధికారులు తెలిపారు. దానిని దాల్మౌ అడవిలో వదిలిపెట్టినట్టు పేర్కొన్నారు. ఆదివారం కావడంతో అదృష్టవశాత్తు బస్సు పార్కింగులో ఉందని, లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు.
 
పార్క్ చేసిన బస్సు సమీపంలో మేకలు మేస్తుండడం కొండ చిలువను ఆకర్షించిందని, వాటి కోసం కొండచిలువ వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. కొండచిలువను చూసి స్థానికులు కేకలు వేయడంతో అది భయపడి బస్సులోకి వెళ్లి దాక్కుని ఉంటుందని పేర్కొన్నారు.