బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (13:15 IST)

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ukraine russia war
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య గత 2022 నుంచి భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇరు దేశాలకు చెందిన అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ సైన్యం రష్యాకు చెందిన అత్యాధునిక హెలికాఫ్టరును నేలకూల్చింది. ఉక్రెయిన్ నేవల్ డ్రోన్ మంగళవారం ఎయిర్ టార్గెట్‌ను విజయవంతంగా చేధించింది. దీంతో రష్యాకు చెందిన ఎంఐ-8 హెలికాఫ్టర్ నేలకూలింది. దాడికి గురైన రష్యా హెలికాప్టర్ పైలట్ ఆ విషయాన్ని రేడియో కమ్యూనికేషనులో మాట్లాడుతూ.. హెలికాప్టర్ దాడికి గురైందని, అది కిందికి జారిపోతోందని చెబుతున్న ఆడియోను ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంపాదించి విడుదల చేసింది.
 
ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. నిన్న మగురా వీ5 నేవల్ డ్రోన్లను ఉపయోగించి నల్ల సముద్రంపై రష్యన్ హెలికాప్టర్‌ను ఉక్రెయిన్ కూల్చేసింది. మరో హెలికాప్టర్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దాడికి గురైన హెలికాప్టర్ నల్ల సముద్రంలో కూలిపోతున్న వీడియోను షేర్ చేసింది.
 
ఆ వీడియో థర్మల్ ఇమేజ్‌లో ఎగురుతున్న హెలికాప్టర్ తెల్లగా కనిపిస్తుండగా ఆకాశం చీకటిగా ఉంది. అస్పష్టంగా ఉన్న వీడియోలో క్షిపణి దాడులు కనిపిస్తున్నాయి. దాడికి గురైన హెలికాప్టర్ నల్ల సముద్రంలో కూలిపోవడానికి ముందు కిందికి జారిపోవడం కనిపించింది. హెలికాప్టర్‌పై దాడి తర్వాత పైలట్ భయభ్రాంతులకు గురయ్యాడు. రేడియో కమ్యూనికేషన్ మాట్లాడుతూ, 482, హెలికాప్టర్‌పై దాడి జరిగింది.. చాపర్ కిందికి జారిపోతోంది' అని చెప్పడం వినిపించింది. 
 
ఆ తర్వాత 'అక్కడ పేలుడు సంభవించింది. హెలికాప్టర్ దాడికి గురైంది. కిందనున్న నీటి నుంచి లాంచ్ వచ్చింది. ఆ తర్వాత మరో ఫ్లాష్ వచ్చింది. అది ఎక్కడికి వెళ్లిందో నేను చూడలేదు. కానీ, మొదటిది నన్ను నేరుగా ఢీకొట్టి సమీపంలోనే పేలిపోయింది. హెలికాప్టర్లో కొన్ని వ్యవస్థలు విఫలమయ్యాయి' అని పైలట్ పేర్కొన్నాడు. 
 
క్రిమియా పశ్చిమ తీరంలోని కేప్ టర్ఖాన్కట్ సమీపంలో ఇది జరిగింది. క్షిపణులు అమర్చిన మగురా వీ5 సముద్ర డ్రోన్ రష్యాకు చెందిన ఎంఐ-8 హెలికాప్టర్‌ను కూల్చివేసింది. ఈ విషయాన్ని జీయూఆర్ స్పె ఏజెన్సీ తన టెలిగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. ఉక్రెయిన్ నేవల్ డ్రోన్ ఎయిర్ టార్గెట్‌ను ఛేదించడం ఇదే తొలిసారని తెలిపింది.