మంగళవారం, 17 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (10:35 IST)

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

Bashar Al-Assad
తాను దేశం విడిచి పారిపోలేదని, రష్యా సైన్యం తనను రక్షించిందని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తెలిపారు. సిరియా దేశాన్ని తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు అసద్ దేశం విడిచిపారిపోయారంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్ తన ఎక్స్ వేదికగా స్పందించారు. 
 
సిరియా రాజధాని డమాస్కస్‌ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకున్న క్రమంలో తాను దేశాన్ని వీడి వెళ్లిపోవాలని అనుకోలేదని అసద్ పేర్కొన్నారు. రష్యా బేస్ నుంచే పోరాటం చేయాలనుకున్నానని తెలిపారు. అయితే, ఆ సైనిక స్థావరంపై డ్రోన్ల దాడులు జరగడంతో రష్యా సైన్యం తనను సురక్షిత ప్రాంతానికి తరలించిందని తెలిపారు. 
 
అసద్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. అసద్‌ను అత్యంత సురక్షితంగా తమ దేశానికి తీసుకొచ్చామని రష్యా విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ సెర్గీ వెల్లడించారు. అసాధారణ పరిస్థితుల్లో మిత్రులకు అవసరమైన సహాయం అందజేస్తుందని చెప్పడానికి ఇదో నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.