మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (16:06 IST)

భారత్‌కు 38 మిలియన్ డాలర్ల బకాయి ఉన్నాం : ఐక్యరాజ్యసమితి

ఐక్యరాజ్యసమితి ఇండియాకు 38 మిలియన్ డాలర్ల బకాయి పడింది. భారత్‌లో 2019 మార్చి నెల వరకు చేపట్టిన శాంతి పరిరక్షణ కార్యక్రమాల కోసం ఖర్చు చేసిన 38 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 
 
అయితే ఐక్యరాజ్యసమితి బకాయిపడ్డ దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో (38 మిలియన్ డాలర్లు) ఉండగా రువాండా (31 మిలియన్ డాలర్లు), పాకిస్థాన్ (28 మిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (25 మిలియన్ డాలర్లు), నేపాల్ (23 మిలియన్ డాలర్లు)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెక్రటరీ జనరల్ తన నివేదికలో తెలిపారు. 
 
ఐక్యరాజ్యసమితి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం గురించి నివేదిక తయారు చేసిన ఆయన, 2019 మార్చి 31 నాటికి ఐక్యరాజ్యసమితి వివిధ దేశాలకు 265 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉందని చెప్పారు.
 
ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కార్యక్రమాల కోసం తమ సైన్యాలు, పోలీసులను పంపి చురుకైన పాత్ర పోషించినందుకు ఆయా దేశాలకు బకాయి పడినట్లు గుటెరెస్ తెలియజేసారు. జూన్ 2019 నాటికి ఇది 588 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని యు.ఎన్ సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు.