శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (11:49 IST)

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు...

డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్.. అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్‌ 777-200 విమానం 231 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో డెన్వర్ నుంచి హోనొలుకు బయలుదేరింది. ఈ క్రమంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆదివారం తెలిపింది. 
 
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పింది. విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
అయితే, విమాన శకలాలు ఓ ఇంటి బయట చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ చిత్రాలను కొలరాడోలోని బ్రూమ్‌ఫీల్డ్‌ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇంజిన్‌ కౌలింగ్‌, టర్ఫ్‌ ఫీల్డ్‌లోని భాగాలు ఉన్నాయి. అలాగే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియో సైతం సోషల్‌ మీడియాలో కనిపించింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ స్టేఫీ బోర్డ్‌ (ఎన్‌టీఎస్‌బీ) తెలిపింది.