సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (10:04 IST)

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడి కోసం మాత్రమే కాకుండా ప్రతినిధుల సభల సభ్యులను ఎన్నుకోవటానికి కూడా ఓటు వేస్తున్నారు. ప్రతి నాలుగేళ్ళకోసారి అధ్యక్ష ఎన్నికలతోపాటు 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు (హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌) కూడా ఎన్నికలు జరుగుతాయి. 
 
ఈ సారి కూడా ఓటర్లు ప్రతినిధుల సభ సభ్యులను ఎన్నుకోనున్నారు. అమెరికా చట్టసభల్లో అత్యంత కీలకమైన సెనేట్‌లో మూడోవంతు స్థానాలకు కూడా మంగళవారం ఓటింగ్‌ జరుగుతున్నది. సెనేట్లో నాలుగేళ్ళకోసారి మూడోవంతు సీట్లు ఖాళీ అవుతాయి. 
 
వాటికి అధ్యక్ష ఎన్నికలతోపాటు ఓటింగ్‌ నిర్వహిస్తారు. వీటితోపాటు 11 రాష్ట్రా గవర్నర్లను, రాష్ట్రాల చట్టసభల్లో ఖాళీ అయిన 86 స్థానాలకు సభ్యులను ఎన్నుకొనేందుకు కూడా అమెరికన్లు ఓటు వేయనున్నారు. అయితే, ఈ ఎన్నికలు జరిగే విధానాన్ని ఓసారి పరిశీలిస్తే, 
 
* అమెరికాలో ప్రజాస్వామ్యమే ఉన్నప్పటికే మన దేశంలో ఉన్నట్టుగా పార్లమెంటరీ వ్యవస్థ లేదు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం సాగుతోంది. 
 
* భారత్‌లో ఓటర్లు నేరుగా ముఖ్యమంత్రి, ప్రధాని పదవులకు ఓట్లు వేయనట్టే అమెరికా ఓటర్లు కూడానేరుగా అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయరు.
 
* ఎన్నికల సమయంలో అభ్యర్థి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రతినిధులను నియమిస్తుంది. ఓటర్లు ఆ ప్రతినిధులకు ఓట్లు వేస్తారు. వారిని ఎలక్టోరల్‌ కాలేజీ అంటారు. ఆ ఎలక్టోరల్‌ కాలేజీ దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.  
 
* అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశంలోని 50 రాష్ట్రాలు, కొలంబియా జిల్లాలో కలిసి మొత్తం 538 ఎలక్టోరల్‌ స్థానాలు ఉన్నాయి. ఈ ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో జనాభాను బట్టి మారుతూ ఉంటుంది. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో మూడే ఉన్నాయి. 
 
* మొత్తం ఎలక్టోరల్‌ ఓట్లలో కనీసం 270 ఓట్లు వచ్చిన అభ్యర్థి అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరిస్తారు.
 
* అగ్రరాజ్యం ఎన్నికల్లో పాపులర్‌ ఓటు విధానం అత్యంత కీలకమైనది. ఒక రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్‌ ఓట్లన్నీ బదిలీ అవుతాయి. ఉదాహరణకు టెక్సాస్‌లో 38 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. 
 
* ఈ రాష్ట్రంలో మంగళవారం నాటి ఎన్నికల్లో రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీలు చెరిసగం ఎలక్టోరేట్లను గెలుచుకున్నాయి అనుకుందాం. అయితే, మొత్తం ఓట్లలో రిపబ్లికన్‌ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే ఈ 38 ఎలక్టోరల్‌ ఓట్లు ఆ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ ఖాతాలోకి వెళ్లిపోతాయి. దీనినే పాపులర్‌ ఓట్‌ అంటారు. 
 
* 2016 అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నాటి డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే 30 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ పాపులర్‌ ఓటు విధానం వల్ల ట్రంప్‌కు ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు రావటంతో ఆయన అధ్యక్షుడు అయ్యారు. 
 
* కేవలం మెయినె, నెబ్రాస్కా రాష్ట్రాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో లేదు. పాపులర్‌ ఓట్లతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రాల ఎలక్టోరల్స్‌ ఓట్లను తమ పార్టీ అభ్యర్థులకు వేసుకోవచ్చు.  
 
* దేశం మొత్తంలో డెమోక్రటిక్‌ పార్టీకి 203, రిపబ్లికన్లకు 125 ఎలక్టోరల్‌ ఓట్ల మద్దతు సంప్రదాయకంగా కొనసాగుతూ వస్తోంది. మిగిలిన 210 స్థానాల్లో మెజారిటీ ఓట్లు గెలుచుకొనేందుకే అభ్యర్థులు కష్టపడుతుంటారు.