శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (11:57 IST)

మరో రెండేళ్ళపాటు కరోనా వైరస్ పోదట.. ప్రపంచ ఆరోగ్య సంస్థ

చైనాలోని వుహాన్ నగరంలో ఆవిర్భవించిన కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచం కుదేలైపోయింది. ఆర్థిక రంగం చిన్నాభిన్నమైపోయింది. మానవ జీవితాలు చెల్లాచెదురైపోయాయి. అలాంటి వైరస్... మరో రెండేళ్ళపాటు ప్రపంచాన్ని వీడిపోదట. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 1918లో వ‌చ్చిన స్పానిష్ ఫ్లూ కూడా అంతం అయ్యేందుకు రెండేళ్లు ప‌ట్టింద‌న్నాడు. ఇపుడు కూడా కరోనా వైరస్ అంతమయ్యేందుకు రెండేళ్ళ సమయం పడుతుందన్నారు. ప్ర‌స్తుతం ఉన్న టెక్నాల‌జీ, జ‌నాల మ‌ధ్య క‌నెక్టివిటితో వైర‌స్ తొంద‌రగా వ్యాప్తి అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 
 
అదేవిధంగా ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర ఉన్న సాంకేతికత‌, ప‌రిజ్ఞానం కూడా వైర‌స్‌ను నియంత్రించ‌గ‌ల‌వ‌న్నారు. ఉత్త‌మ టెక్నాల‌జీ అందుబాటులో ఉన్న కార‌ణంగా.. రెండేళ్ల‌లోపే క‌రోనా వైర‌స్ క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. 
 
వైర‌స్ నియంత్ర‌ణ‌లో జాతీయ ఐక్య‌త‌, ప్ర‌పంచ దేశాల సంఘీభావం కావాల‌న్నారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న అన్ని విధానాల‌తో వైర‌స్‌ను నియంత్రించాలని, వ్యాక్సిన్ తోడైతే ఇంకా బాగుంటుంద‌న్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల సుమారు 2.20 కోట్ల మంది వైర‌స్ బారిన‌ప‌డగా, 7,93,382 మంది ప్రాణాలు కోల్పోయారు.