బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (10:20 IST)

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన.. ఎక్కడ?

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన అందుబాటులోకి వచ్చింది. ఈ అద్భుత నిర్మాణానికి తొమ్మిదేళ్ళ సమయం పట్టింది. ఈ వంతెన పొడవు 55 కిలోమీటర్లు. ఇది హాంకాంగ్ నుంచి మకావు మీదుగా చైనాలోని జుహాయి నగరం వరకు నిర్మించారు. 
 
ఈ వంతెనను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణానికి 2,000 కోట్ల డాలర్లు (దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేశారు. భద్రత సమస్యల వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఆలస్యం జరిగింది. ఈ పనుల్లో 18 మంది కార్మికులు చనిపోయారని అధికారులు చెప్పారు. 
 
ఈ వంతెన ప్రత్యేకతలను పరిశీలిస్తే, చైనాలోని మూడు తీర ప్రాంత నగరాలను - హాంకాంగ్, మకావు, జుహాయిలను కలుపుతూ నిర్మించారు. భూకంపాలు, తుఫాన్లను తట్టుకునే విధంగా నిర్మించిన ఈ వంతెన కోసం 4 లక్షల టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ మొత్తం ఉక్కుతో 60 ఐఫిల్ టవర్లను కట్టవచ్చు.
 
ఈ వంతెనలో 30 కిలోమీటర్ల మార్గాన్ని పెరల్ రివర్ డెల్టా సముద్రం మీదే నిర్మించారు. ఇందులో 6.7 కిలోమీటర్ల రోడ్డు మధ్యలో సముద్ర గర్భంలో ఉంటుంది. రెండు కృత్రిమ దీవుల గుండా ఈ సొరంగ మార్గం వెళ్తుంది. ఇందులో ఇంకా లింకు రోడ్లు, జూహాయి, హాంకాంగ్ నగరాలను ప్రధాన వంతెనకు కలిపే భూతల సొరంగమార్గాలు కూడా ఉన్నాయి.