బుధవారం, 18 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:59 IST)

140 పరుగులు చాలు అనుకున్నాను.. అంబటి కోలుకుంటాడు: ధోనీ

ఐపీఎల్ రెండో ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘనవిజయం సాధించి పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వెనువెంటనే వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. 
 
ఓపెనర్ గైక్వాడ్, డారెన్ బ్రేవో అద్భుత ఇన్నింగ్స్ తో జట్టుకి మంచి స్కోర్ అందించారు. అయితే ముంబై ఇండియన్స్ లక్ష్య చేధనలో చతికిలపడి ఘోర ఓటమి చవిచూసింది. మ్యాచ్ అనంతరం మీడియాతో ధోని మాట్లాడుతూ ఆరంభంలో త్వరగా వికెట్స్ కోల్పోవడంతో 140 పరుగులు చేస్తే సరిపోతుందని అనుకున్నానని, కాని గైక్వాడ్ బ్యాటింగ్ తో అనుకున్న స్కోర్ కంటే ఎక్కువే సాధించామని తెలిపాడు.
 
ఇక పిచ్ నెమ్మది అవడంతో బ్యాటింగ్ కి అనుకూలించకే వికెట్స్ కోల్పోయామని, నేను కూడా 9వ ఓవర్ నుండి హిట్టింగ్ స్టార్ట్ చేయాలనీ భావించినట్టు ధోని తెలిపాడు. అంబటి రాయుడు గాయం అంత పెద్దది కాదని తరువాత మ్యాచ్‌కి మరో నాలుగు రోజులు సమయం ఉన్నందున అంతలోపు కోలుకుంటాడని ధోని క్లారిటీ ఇచ్చాడు. 
 
ముంబై ఇండియన్స్‌లో సౌరభ్ తివారి మినహా బ్యాటింగ్‌లో ఎవరు అంతగా రాణించలేదు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు, దీపక్‌ చాహర్‌ రెండు, హేజిల్ వుడ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తలో వికెట్ తీశారు. సోమవారం అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో కలకత్తా నైట్ రైడర్స్ తలపడనున్నారు.