బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐపీఎల్ టోర్నీకి దూరమవుతున్న ఒక్కో క్రికెటర్.. ఎందుకని?

కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ టోర్నీ అక్టోబరు నెలలో దుబాయ్ వేదికగా పునఃప్రారంభంకానుంది. అయితే, ఈ టోర్నీ ప్రారంభానికి ముందే ఒక్కో క్రికెటర్ క్రమంగా దూరమవుతున్నారు. ఇప్పటికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో, పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలన్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌ రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ వ్యక్తిగత కారణాల దృష్ట్యా మిగతా సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
 
తాజాగా ‘ఐపీఎల్‌-2021 మిగతా సీజన్‌లో డేవిడ్‌ మలన్‌ ఆడటం లేదు. టీ20 ప్రపంచకప్, యాషెస్‌ సిరీస్‌ వెంట వెంటనే ఉండటంతో.. అతడు తన కుటుంబంతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ అడెన్‌ మార్క్రమ్‌ ఆడనున్నాడు’ అని పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం ట్వీట్‌ చేసింది. 
 
అలాగే, భారత జట్టు సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లను ఆయా జట్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా దుబాయి తరలిస్తున్నాయి. దుబాయిలో ఆరు రోజుల క్వారంటైన్‌ అనంతరం ఆటగాళ్లు తమ జట్టు సభ్యులతో చేరనున్నారు.