శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:40 IST)

ఆగిపోయిన ట్విట్టర్ - ఫేస్‌బుక్ - ఇన్‌స్టా సేవలు పునరుద్ధరణ

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 గంటలపాటు స్తంభించిపోయిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. గత రాత్రి 9 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల సేవలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. 
 
ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫేస్‌బుక్... సేవల పునరుద్ధరణకు నడుంబిగించింది. 
 
మొత్తానికి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అకస్మాత్తుగా సేవలు నిలిచిపోవడంపై ఫేస్‌బుక్ క్షమాపణలు తెలిపింది. తిరిగి ఆన్‌లైన్‌లోకి వస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. 
 
తమకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొంది. కాగా, గత రాత్రి సామాజిక మాధ్యమాలన్నీ ఒక్కసారిగా మూగబోవడంతో ఏం జరుగుతోందో అర్థంకాక వినియోగదారులు అయోమయానికి గురయ్యారు.