ఒప్పోకి కరోనా సెగ.. ఆరుగురు ఉద్యోగులకు కరోనా.. కంపెనీ షట్ డౌన్
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పోకి కూడా కరోనా సెగ తాకింది. ఒప్పోకు చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఒప్పో.. ఫలితంగా యూపీలోని గ్రేటర్ నోయిడాలోని ఒప్పో ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలటంతో కంపెనీలోని మరో మూడు వేలమంది ఉద్యోగులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా వైరస్ విస్తరించకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో నోయిడా పారిశ్రామిక వాడలోని ఒప్పో మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రంలో కార్యకలాపాలు నిలిచిపోవటం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల సడలింపులతో తిరిగి మే 8న కంపెనీ ప్రారంభమైంది.
అయితే ప్రస్తుతం ఒప్పోలో పనిచేసే మూడు వేలకుపైగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. మూడు వేల మంది ఉద్యోగుల కరోనా టెస్టు ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు ఒప్పో తెలిపింది.