1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జులై 2025 (12:34 IST)

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలెట్లపై నిందలు మోపొద్దు

air india crash plane
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు చేసిన దర్యాప్తు మేరకు.. పైలెట్ల మధ్య మనస్పర్థలు కావరణంగా ఇంధన సరఫరా స్విఛ్‌లను ఆఫ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై భారత పైలట్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఈ ఘటనలో పైలట్లదే తప్పు అనే విధంగా వచ్చిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్పీఏ) తప్పుబట్టింది. ఈ నివేదికలో పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని సూచించడం పట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించగా, ఒక్కరు మాత్రమే బయటపడ్డారు.
 
గత నెల 12వ తేదీన అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులతో పాటు వైద్య విద్యార్థులు, విమాన సిబ్బందితో కలిపి సుమారుగా 265 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. 
 
భారత విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, టేకాఫ్ సమయంలో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిపివేయబడిందని గుర్తించారు. ఆ సమయంలో ఒక పైలట్ మరొకరిని 'ఎందుకు ఇంధనాన్ని కట్ చేశావు?' అని ప్రశ్నించగా, నేను ఆఫ్ చేయలేదని మరో పైలట్ జవాబిచ్చినట్టు కాక్‌పిట్ వాయిస్ రికార్డరులో నమోదైందని నివేదిక తెలిపింది.
 
అయితే, ఏఎల్పీఏ ఈ నివేదికను విమర్శిస్తూ, దర్యాప్తు పక్షపాతంతో కూడుకున్నదని, పారదర్శకత లోపించిందని ఆరోపించింది. దర్యాప్తు ప్రక్రియలో పైలట్లను కనీసం పరిశీలకులుగా చేర్చాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వస్తున్నవి అసంబద్ధ ఊహాగానాలు అంటూ సంఘం ఖండించింది. 
 
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కూడా, ఈ నివేదిక ప్రాథమికమైనదని, తుది నివేదిక వచ్చే వరకు ఎవరినీ నిందించవద్దని సూచించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బోయింగ్ 787-8 విమానంలో ఉన్న ఇంధన స్విచ్‌లు జాగ్రత్తగా రూపొందించబడ్డాయి. వాటిని అనుకోకుండా మార్చడం కష్టం. అయినప్పటికీ, ఈ స్విచ్‌లు ఎందుకు కట్అఫ్ స్థితికి మారాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.