AI vs Indian Intelligence, అపార్టుమెంట్ గృహ ప్రవేశానికి గోవుకి బదులు గోవు మరబొమ్మ (video)
గృహ ప్రవేశం సమయంలో గోవును ఇంట్లోకి తీసుకుని వస్తారు. తద్వారా ఆ ఇంట శ్రేయస్సు, సంపద, సమృద్ధి మరియు అదృష్టం నెలకొంటాయని, దారిద్ర్యం తొలగిపోతుందని నమ్ముతారు. అందుకే చాలామంది దూడతో సహా గోవును తీసుకువస్తారు. ఇది సంతానం, వంశాభివృద్ధిని కూడా సూచిస్తుంది. ఐతే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
గృహ ప్రవేశం పూజ సందర్భంలో ఓ అపార్టుమెంట్లో గోవుకి బదులు గోవు మరబొమ్మను వదిలారు. అది కాస్తా కీచ్ కీచ్ అని శబ్దం చేసుకుంటూ ఇల్లంతా తిరుగుతూ వుంటే అందరూ ఎంతో సంబరిపడిపోతున్నారు. ఐతే నిజమైన గోవుతో కాకుండా ఇలా మరబొమ్మలతో చేయడంపై పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గోవు రాకపోతే ఇలాంటి పనులు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే.. AI vs Indian Intelligence అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అసలు గృహ ప్రవేశ సమయంలో గోవును ఎందుకు తీసుకువస్తారో తెలుసుకుందాము. గోవును పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. దాని పంచగవ్యాలు (పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం) అత్యంత పవిత్రమైనవి. అలాంటి గోవు ఇంటి లోపల తిరిగినప్పుడు, దాని పాదాలు తగిలిన ప్రదేశం పరిశుభ్రం అవుతుందని, ఇంటిలోని నెగటివ్ శక్తి తొలగిపోయి సాత్విక వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు. గోవు యొక్క గోమయం, గోమూత్రం నూతన గృహంలో పడటం మరింత శుభసూచకంగా భావిస్తారు, ఇది వాస్తు దోషాలను నివారిస్తుందని విశ్వసిస్తారు.