బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

దొంగలో మార్పు తెచ్చిన భగవద్గీత... చోరీ చేసిన నగలను తిరిగిచ్చేశాడు..

thief
ఒడిశా రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ఓ దొంగలో భగవద్గీత మార్పు పెను మార్పు తెచ్చింది. దీంతో ఆలయంలో తాను చోరీ చేసిన బంగారు నగలను తిరిగి ఇచ్చేశాడు. అంతేకాకుండా తాను చేసిన ఈ పనికి క్షమాపణలు కోరుతూ ఆలయ పూజారికి లేఖ రాసి అక్కడ వదిలి వెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భువనేశ్వర్‌లోని గోపీనాథ్‌పూర్‌ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీకి గురైన శ్రీకృష్ణుడి ఆభరణాలు ఓం సంచితో పాటు ప్రత్యక్షమయ్యాయి. దీంతో పాటు క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300లు ఆలయ ముఖద్వారం వద్ద లభ్యమయ్యాయి. 
 
అయితే, ఇటీవల భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని రూ.లక్షల విలువ చేసే ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ ఆ లేఖలో రాశాడు. 2014లో యజ్ఞశాలలో ఆభరణాల్ని చోరీ చేసినప్పట్నుంచి తనకు పీడకలలు వస్తున్నాయని.. అనేక సమస్యలు తనను చుట్టుముట్టినట్టు లేఖలో తన బాధను వెళ్లబోసుకున్నాడు. 
 
మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ పూజారి దేబేష్‌ చంద్ర మహంతి మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి కిరీటం, చెవిపోగులు, కంకణాలు, వేణువు తదితర ఆభరణాలతో బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ముఖద్వారం వద్ద వదిలి వెళ్లిపోయారని తెలిపారు. అతడు చేసిన పనికి క్షమాపణలు కోరుతూ.. ఆ బ్యాగులో రూ.300లు కూడా ఉంచాడన్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమేనన్నారు.