శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (19:13 IST)

పెళ్లైన 15 రోజులకే నవ వధువు మృతి.. పెళ్లి పందిరి కిందే..?

పెళ్లై 15 రోజులు కూడా కాలేదు. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ఆ నవ వధువు ప్రాణాలను హరించింది. ఆమె ఆశలన్నీ చెదిరిపోయాయి. కలలన్నీ కూలిపోయాయి. ఎంతో ఆనందంగా అత్తారింట్లో అడుగుపెట్టాలనుకున్న ఆ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
 
కర్ణాటకలోని బెంగళూరులో ఈ విషాద ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆ యువతి పేరు ధనుష. ఆమె వయసు 23 సంవత్సరాలు. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు తాలూకాలో ఉన్న దరందకుక్కు అనే చిన్న పల్లెటూరు ఆమె స్వస్థలం. ఆమెకు ఫిబ్రవరిలో పెళ్లి కుదిరింది. 
 
ఇరు కుటుంబాల పెద్దలు ఫిబ్రవరి 23న పెళ్లి జరిపించాలని నిశ్చయించారు. నిశ్చయ తాంబూలాలు మార్చుకున్నారు. యువతి ధనుషకు, గోపిక్‌కు నిశ్చితార్థం జరిగింది. మార్చి 21న పెళ్లి జరిగింది. 
 
ఇరు కుటుంబాల్లో పెళ్లి జరిగిన సంతోషం కనిపించింది. అంతా బాగుందనుకున్న తరుణంలో.. ఏప్రిల్ 3న ఆ నవ వధువు తన భర్త గోపిక్, అత్త సుబ్బలక్ష్మి, మరో బంధువైన రూపా వేణుగోపాల్‌తో కలిసి బెంగళూరుకు పెళ్లి అనంతరం బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి బయల్దేరి వెళ్లింది.
 
బెంగళూరు శివారు ప్రాంతమైన నేలమంగళ వద్దకు రాగానే కోళ్లను తరలిస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ధనుషకు తీవ్ర గాయాలు అయి రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.
 
గోపిక్‌తో పాటు మిగిలిన వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిద్రమత్తులో కారును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు. ధనుష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. 
 
కొత్త పెళ్లి కూతురిగా వెళ్లిన తమ కూతురు ఇలా విగత జీవిగా తిరిగి రావడాన్ని తట్టుకోలేకపోయిన ధనుష తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాళ్ల పారాణి ఆరక ముందే తమ ఇంటి దీపం ఆరిపోయిందని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది.
 
ధనుష మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరి కిందే ఆ నవ వధువు మృతదేహాన్ని ఉంచాల్సిన పరిస్థితి ఆ తల్లిదండ్రులకు రావడం శోచనీయం.