1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (16:41 IST)

లాక్ డౌన్ ఎఫెక్ట్... పెరిగిపోతున్న పెండ్లికాని ప్రసాద్‌లు, పెండ్లికాని మిస్సమ్మలు

గత ఏడాది సరిగ్గా ఈ సమయానికి పెళ్ళిళ్ల సీజన్‌లోనే లాక్ డౌన్ పడి చాలా వరకు లగ్గాలు ఆగిపోయాయి. దీంతో వీటిపై ఆధారపడిన చాలామంది జీవనోపాధి కోల్పోయారు. టెంట్ హౌజ్, బ్యాండ్ మేళం, మేకప్ ఆర్టిస్టులు, డెకరేషన్, వంట వాళ్లు.. ఇలా ఒక్క టేమిటి పెళ్లిల్లు, ఫంక్షన్ల బిజినెస్ లు మొత్తం కుప్పకూలాయి. 
 
చాలా మంది రోడ్డున పడ్డారు. ఇక ఫస్ట్ వేవ్ తగ్గింది కదా ఈ సారి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది అనుకునే టైమ్ కు కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ నెల 29 నుంచి జూలై 4 వరకు 30కి పైగా మంచి పెళ్లి ముహూర్తాలున్నాయని పురోహితులు చెబుతున్నారు.
 
కరెక్ట్‌గా మళ్లీ ఇదే టైమ్‌లో కరోనా తీవ్ర స్థాయిలో రావడంతో పెళ్లిల్లు మళ్లీ వాయిదా పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పెండ్లికాని ప్రసాద్‌లు, పెండ్లికాని మిస్సమ్మలు ఏటేటా పెరిగిపోతున్నారు. ఇక ఏదేమైనా సరే అని కొందరు సింపుల్‌గా పెండ్లి చేసుకుంటున్నా.. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. 
 
ఎందుకంటే పెండ్లి అనేది ఒకే సారి చేసుకుంటాం కాబట్టి.. కోవిడ్ తగ్గాకే గ్రాండ్ గా చేసుకుందాం అని అనుకునే వారు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఇప్పుడు పెళ్లిల్లు ఫిక్స్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో.. వారందరికీ పెళ్లిల్లు ఎప్పుడు అవుతాయో అంటూ వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.