భారత్ మమ్మలను ఆదుకుంది... మేమూ సాయం చేస్తాం : జో బైడెన్
కరోనా సునామీలో కొట్టుమిట్టాడుతున్న భారత్‌ను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇందులోభాగంగా, అగ్రరాజ్యం అమెరికా కూడా తన వంతు సాయం చేసేందుకు సమ్మతించింది. కరోనాతో పోరాడుతున్న ఇండియాకు అవసరమైన అన్ని రకాల సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ స్పష్టం చేశారు.
గతంలో తాము కష్ట సమయాల్లో ఉన్నపుడు భారత్ తమకు అండగా నిలిచిందని, ఇప్పుడు తాము కూడా అదే పని చేస్తామని బైడెన్ ట్వీట్ చేశారు. ఇండియాకు అత్యవసరమైన మందులు, పరికరాలు పంపిస్తున్నట్లు వెల్లడించారు.
మహమ్మారి తొలినాళ్లలో మా హాస్పిటల్స్ కొవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోయి ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇండియా మాకు సాయం చేసింది. ఇప్పుడు మేము కూడా ఇండియాకు అవసరమైన సాయం చేస్తాం అని బైడెన్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.
గత వీకెండ్‌లో తన సొంతిళ్లు ఉన్న డెలవేర్‌కు వెళ్లిన బైడెన్.. అక్కడి నుంచే ఇండియాలో ప్రస్తుత పరిణామాలను తెలుసుకున్నారు. అటు ఉపాధ్యక్షురాల కమలా హ్యారిస్ కూడా ఇండియాకు అవసరమైన సాయం చేస్తామని మరో ట్వీట్‌లో తెలిపారు.
ఈ కొవిడ్ క్లిష్ట సమయంలో ఇండియాకు అవసరమైన అదనపు మద్దతు, ఇతర వైద్య పరికరాలను పంపించడానికి భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. సాయం చేయడంతోపాటు కరోనాతో పోరాడుతున్న అక్కడి హెల్త్‌కేర్ వర్కర్లు, భారత ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం అని కమలా ట్వీట్ చేశారు.