శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (16:17 IST)

కాపలాదారే దొంగ... రాత్రికి రాత్రే తుగ్లక్ ఆదేశాలు : శత్రుఘ్న సిన్హా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మాటలతూటాలు పేల్చారు. కాపలాదారే దొంగ అంటూ ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే తుగ్లక్ ఆదేశాలు జారీ అవుతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో జరిగిన విపక్షాల భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
గతంలో ఇంతకంటే పెద్ద సభను ఎన్నడూ చూడలేదన్నారు. దేశానికి కొత్త నేతృత్వం కోసం విపక్ష నేతలు ఇక్కడ సమావేశమయ్యారు. మనందరి లక్ష్యం, ఉద్దేశం ఒక్కటే.. పరివర్తన తీసుకురావడం. కొత్త నేతృత్వంలో సరైన దిశలో వెళ్లేందుకు ముందడుగు పడింది. బీజేపీలో చేరడానికి కంటే ముందు నేను ఈ దేశానికి చెందిన వ్యక్తిని. వాజపేయి హయాంలో లోకకల్యాణం జరిగింది. మోడీ ప్రభుత్వంలో రాత్రికి రాత్రే తుగ్లక్ ఆదేశాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. 
 
అంతేకాకుండా, నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు ఏం మేలు జరిగింది? నోట్ల రద్దుతో రైతులు, దినసరి కూలీలు, సామాన్యులపై తీవ్ర ప్రభావం పడింది. రాత్రికి రాత్రే జీఎస్టీ అమలు చేశారు. ఎలాంటి ఆలోచన, చర్చలు లేకుండా జీఎస్టీలో 300కు పైగా సవరణలు జరిగాయి. చిరు వ్యాపారులు, సంస్థలపై జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రాఫెల్ స్కామ్ వ్యవహారాన్ని దాచేందుకు ఎందుకు చూస్తున్నారు. రాఫేల్ అంశాన్ని దాచాలని చూస్తే.. కాపలాదారే దొంగ అని ప్రజలు అనుకుంటారు. రాఫేల్ విమానాల ధరలు మూడింతలు ఎందుకు పెరిగాయి? ఒక్కో విమానం రూ.1600 కోట్లకు ఎందుకు కొనుగోలు చేశారు? ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌కు విమానాల ఒప్పందం ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నల వర్షం సంధించారు. కాగా, విపక్షాలు నిర్వహించిన సభలో బీజేపీ ఎంపీగా ఉన్న శత్రుఘ్న సిన్హా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.