ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు.. భారీ నష్టం.. హెక్టార్ల భూమి కొట్టుకుపోయింది..
ఉత్తరాఖండ్‌లో మరోసారి ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. గత వారం వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో ఉత్తరాఖండ్‌లోని తేహ్రీ ప్రాంతం వణికిపోయింది. వరదలకు పెద్ద ఎత్తున ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి.
రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఉత్తరాఖండ్ గజగజలాడుతోంది. తెహ్రీ జిల్లాలోని దేవ్‌ప్రయాగ్‌లో ఆకస్మికంగా కురిసిన వానలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
కోవిడ్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలను మూసివేశారు. దీంతో ప్రాణ నష్టం జరగలేదు. ఉత్తరాఖండ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొండలపై వర్షం భారీగా పడుతోంది. తేహ్రీ దేవ్‌ప్రయాగ్‌లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి లొతట్లు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. వర్షం నీటికి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకు భారీగా నీరుతో పాటు బురద కూడా చేరుతోంది. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎస్‌డీఆర్‌ఎఫ్ జట్లను కూడా రంగంలోకి దించింది.
గత వారం కురిసిన ఆకస్మిక వర్షాల కారణంగా ఘన్సాలీ, జఖానిధర్ బ్లాక్స్ చాలా నష్టపోయాయి. అనేక హెక్టార్ల భూమి కొట్టుకుపోగా.. అనేక వాహనాలను ఘన్సాలీ మార్కెట్లో శిథిలాల కింద పూడ్చిపెట్టుకుపోయాయి.