ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (17:13 IST)

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే చచ్చిపోవాల్సిందే : సీఎం యోగి (Video)

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా ఎవరైనా పోరాటం చేస్తే వారంతా మరణాన్ని కోరుకునేవారేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 
 
ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, సీఏఏకు నిరసనగా గత డిసెంబరులో జరిగిన అల్లర్లలో సుమారు 20 మంది మృతి చెందారని గుర్తుచేశారు. ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ అల్లర్లలో పోలీసుల తూటాలకు ఎవరూ మరణించలేదన్నారు. ఒకరిని షూట్ చేయాలనే ఉద్దేశంతో మరొకరు వీధిలోకి వస్తే.. అతడైనా చావాలి.. లేదా ఆ పోలీసైనా మరణించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత నెలరోజులుగా యూపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నో, కాన్పూర్, ప్రయాగ్ రాజ్ ప్రాంతాల్లో నిరసనలు ఇప్పటికీ సాగుతున్నాయి. 'స్వేఛ్చ కోసం వీరంతా నినాదాలు చేస్తున్నారు.. కానీ స్వేఛ్చ అంటే ఏమిటి? మహమ్మద్ అలీ జిన్నా కోసం మనం పని చేస్తున్నామా లేక గాంధీజీ ఆశయ సాధనకోసమా' అని యోగి ప్రశ్నించారు. 
 
ఎవరైనా చనిపోవాలనుకుని వస్తుంటే.. వాళ్లు ఎలా బతికి ఉంటారు (అగర్ కొయి మర్నే కే లియే ఆ హీ రహా హై తో వో జిందా కహా సే హో జాయేగా) అని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుకొంటే సరే. అలా కాకుండా కొందరు ప్రజాస్వామ్యం ముసుగులో హింసకు పాల్పడితే.. మేం కూడా వారి భాష (హింస)లోనే బదులిస్తాం.. అని హెచ్చరించారు. యోగి చేసిన ఈ కామెంట్లపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.