శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (10:30 IST)

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే మీ ఆస్తులు వేలం వేస్తాం : సీఎం యోగి హెచ్చరిక

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో భాగంగా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, నష్టం కలిగించినా సహించబోమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. పైగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన ఆందోళనకారులను గుర్తించి, వారి ఆస్తులను వేలం వేసి ఆ నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. 
 
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీ రాజధాని లక్నతోపాటు పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనకారులు పలు చోట్ల ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చారు. వీటిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనకు దిగి హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
నిరసనల్లో జరిగిన ఆస్తుల నష్టానికి బదులు తీర్చుకుంటామన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదన్నారు. సీఏఏని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, వామపక్ష పార్టీలు దేశాన్ని మంటల్లోకి తోస్తున్నాయని ఆరోపించారు.
 
లక్నో, సంబల్ ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారి ఆస్తులను వేలంవేసి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. ఈ ఘటనల్లో హింసకు దిగిన వారికి సంబంధించి వీడియోలు తీశామన్నారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.