1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (16:54 IST)

జెండా ఎగురవేశాడు... స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పి అమరుడయ్యాడు.. ఎక్కడ?

జెండా ఎగురవేసిన ఓ గంటలోనే అదే జాతీయ జెండాను తన భౌతికకాయంపై కప్పుకున్నాడో అమరవీరుడు. అతని పేరు ప్రమోద్ కుమార్. సీఆర్పీఎఫ్ కమాండెంట్. స్వాతంత్ర్య దినోత్సవమైన సోమవారం శ్రీనగర్‌లోని నౌహట్టా ప్రాంతంలో మిలి

జెండా ఎగురవేసిన ఓ గంటలోనే అదే జాతీయ జెండాను తన భౌతికకాయంపై కప్పుకున్నాడో అమరవీరుడు. అతని పేరు ప్రమోద్ కుమార్. సీఆర్పీఎఫ్ కమాండెంట్. స్వాతంత్ర్య దినోత్సవమైన సోమవారం శ్రీనగర్‌లోని నౌహట్టా ప్రాంతంలో మిలిటెంట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన ప్రాణాలు విడిచారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శ్రీనగర్‌లోని కరన్ నగర్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో కమాండెంట్ ప్రమోద్ కుమార్ పని చేస్తున్నాడు. ఈయన సోమవారం ఉదయం 8.29 గంటలకు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ సీఆర్పీఎఫ్ డీజీ సందేశాన్ని తన సైనిక బృందానికి వినిపించారు. దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. 
 
'ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు కాశ్మీర్‌లో రాళ్లు విసురుతుండటాన్ని కూడా మనం ఎదుర్కొంటున్నాం. మనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తూ దేశ సమగ్రత, సమైక్యత, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను నిలబెట్టేందుకు కృషిచేద్దాం. ఎంతో మహత్తరమైన పోరాటం తర్వాత ఇవి మనకు లభించాయి' అని ఆయన పేర్కొన్నారు.
 
ఆ తర్వాత జెండాను ఎగురవేసిన మూడు కిలోమీటర్ల దూరంలోని నౌవాట్టా ప్రాంతంలో ఇద్దరు మిలిటెంట్లు కాల్పులకు దిగారని సమాచారం అందడంతో ఆయన వెంటనే సీఆర్పీఎఫ్ బృందంతో అక్కడికి చేరారు. మిలిటెంట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రమోద్ నాయకత్వం వహించారు. ఆయన గన్ నుంచి దూసుకుపోయిన తూటా ఓ మిలిటెంట్‌ను హతమార్చింది. కానీ అంతలోనే ఓ మిలిటెంట్ తూటా వచ్చి ఆయన మెడకు దిగింది. కోమాలోకి వెళ్లిపోయిన ఆయనను వెంటనే శ్రీనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయిందని, మధ్యాహ్నానికి ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.