శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (10:47 IST)

తౌటే తుపాన్‌.. ముంబై తీరంలో కొట్టుకుపోయిన నౌక.. 26మంది మృతి

తౌటే తుపాన్‌ ధాటికి సోమవారం ముంబై తీరంలో నౌక కొట్టుకుపోయింది. సోమవారం ముంబై తీరంలో కొట్టుకుపోయిన పీ-305 నౌకలో 26 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం నేవీ, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
పీ-305 నౌక నుంచి ఇప్పటివరకు 186 మందిని రక్షించారు. ఈ నౌకలో మొత్తం 261 మంది ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు. తౌటే తుపాన్‌ బీభత్సానికి మొత్తం మూడు బార్జిలు, ఒక ఆయిల్‌ రిగ్‌ కొట్టుకుపోయాయి. మిగతా రెండు షిప్పుల్లోని వారిని సురక్షితంగా కాపాడగా.. పీ-305 మునిగిపోయింది. దీంతో గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్‌ గాలిస్తున్నాయి.
 
అయితే.. భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా.. ఓఎన్‌జీసీ కార్పొరేషన్‌ పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము అలర్ట్‌గా ఉన్నా.. తౌటే తుపాన్‌ తమ మార్గాన్ని మార్చేసిందన్న ఓఎన్‌జీసీ వాదనలు ఐఎండీ కొట్టిపారేసింది. ప్రతి మూడు గంటలకు ఓసారి తుపాన్‌ హెచ్చరికలను ఓఎన్‌జీసీకి పంపామంటున్నాయి వాతావరణ శాఖ వర్గాలు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నుంచి హెచ్చరికలు చేసినా.. బార్జిలు తొలగించలేదన్న వాదనను ఓఎన్‌జీసీ కొట్టిపారేయడంతో.. వాతావరణ శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
 
మరోవైపు మూడు నౌకలు మునిగిపోయిన ఘటనపై.. పెట్రోలియం మంత్రిత్వ శాఖ సీరియస్‌ అయింది. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రిత్వ శాఖ.. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు కమిటీని నియమించింది. నెల రోజుల్లోగా పూర్తి నివేదికను ఇవ్వాలంటూ ముగ్గురు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది.