శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (09:02 IST)

'వస్తున్నా.. వస్తున్నా... మీ కోసం వస్తున్నా'... జయలలిత అనూహ్య ప్రకటన

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనూహ్య ప్రకటన చేస్తున్నారు. త్వరలోనే సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీ ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలు, ఆన

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనూహ్య ప్రకటన చేస్తున్నారు. త్వరలోనే సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీ ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలు, ఆనందంలో మునిగిపోయారు. 
 
సెప్టెంబరు 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత... తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె ఆరోగ్యంపై వివిధ రకాల పుకార్లు కూడా వ్యాపించాయి. వీటిని రుజువు చేసేలా జయలలితకు అపోలో ఆస్పత్రి వైద్యులతో పాటు.. లండన్, సింగపూర్ దేశాలకు చెందిన వైద్యులతో పాటు.. ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక వైద్య బృందం కూడా వైద్య సేవలు అందించింది. 
 
అదేసమయంలో తమ అభిమాన నాయకురాలు, తమ దైవం, అమ్మగా భావించే అన్నాడీంకే శ్రేణులు అపోలో ఆస్పత్రిని ఓ దేవాలయంగా మార్చేసి.. పూజలు, పునస్కారాలు, హోమాలు జరిపించారు. ఇలా... గత 52 రోజులుగా ఆస్పత్రి వద్ద ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత ఆదివారం రాత్రి అనూహ్య ప్రకటన విడుదల చేశారు. 'త్వరలోనే వస్తున్నా'నని స్వయంగా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలిపోయారు.
 
ఆస్పత్రిలో జయలలిత చేరిక నింపిన విషాదాన్ని దూరం చేసేలా జయలలిత ఆదివారం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ద్వారా ఆ ప్రకటన విడుదల చేసింది. అందులో... రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ, ప్రపంచమంతటా అభిమానులు, శ్రేయోభిలాషులు చేసిన ప్రార్థనలు ఫలించటం వల్లే తాను పునర్జన్మ ఎత్తానని పేర్కొన్నారు. 
 
‘మీ ఆదరాభిమానాలు ఉన్నంత వరకూ నాకెలాంటి కొదువ లేదు. నన్ను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్న భగవంతుడి కృపాకటాక్షాలతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో సీఎంగా విధులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. నేనిప్పటి దాకా విశ్రాంతి అనేదీ ఎరుగను. శ్రమ ఏనాటికీ నన్ను విడిచిపెట్టదు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ప్రోద్బలంతో ప్రజాసేవలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకోసం, పార్టీ కోసం అహరం పాటుపడుతూ వచ్చాను. ఏనాడు ఏ క్షణమూ విశ్రాంతి తీసుకుని ఎరుగను. అలాంటిది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాననే దిగులుతో పార్టీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారని తెలుసుకుని ఎంతో ఆవేదన చెందాను. పార్టీ కార్యకర్తలు నాపై చూపుతున్న ఆదరాభిమానాలు, పార్టీ కోసం చేస్తున్న శ్రమ వృథా కావు. పార్టీని ప్రగతిపథంలో నడిపిస్తాయి’ అంటూ ఆ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.