శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (11:03 IST)

ఆ ఐఏఎస్ సర్వీస్ 27 యేళ్లు... బదిలీలు 52 సార్లు... బీజేపీ కూడా ఆ రేవు గుడ్డే

అశోక్ ఖేమ్కా.. దేశంలో ఉన్న అరుదైన నిజాయితీపరుడు. ముక్కుసూటి అధికారి. ఈ రెండు లక్షణాలతోనే ఆయన రాజకీయ నాయకులకు బద్ధ విరోధిగా మారిపోయారు. ఫలితంగా ఆయన 27 యేళ్ళ వృత్తి జీవితంలో ఇప్పటివరకు ఏకంగా 52 సార్లు బదిలీ అయ్యారు. గత యూపీఏ ప్రభుత్వం ఆయనపై పగబట్టిందని నాడు విపక్షంలో ఉన్న బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇపుడు హర్యానా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే పని చేస్తోంది. ఆయనపై బదిలీలపై బదిలీ వేటు వేస్తోంది. ఫలితంగా 52వ సారి ఆయన బదిలీ అయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానా రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అశోక్ ఖేమ్కా ఉన్నారు. ఆయన్ను ఇపుడు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా బదిలీ చేస్తూ హర్యానాలోని బీజేపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. 
 
గతం 2012 సంవత్సరంలో నాటి కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ, డీఎల్ఎఫ్‌ల మధ్య కుదిరిన భూఒప్పంద మార్పును అశోక్‌ రద్దు చేసి సంచలనం సృష్టించారు. ఫలితంగా ఆయనతో పాటు మొత్తం ఎనిమిది మందిపై నాడు హర్యానా ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇపుడున్న బీజేపీ సర్కారు కూడా ఆయనతో పాటు మొత్తం 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.