బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శనివారం, 3 నవంబరు 2018 (16:23 IST)

కాంగ్రెస్ ఓట్లు టిడిపికి పడతాయా..? పొత్తు ఫలిస్తుందా..!

దీర్ఘకాల శత్రుత్వం మరచి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంది తెలుగుదేశం. దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ పొత్తు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్నా… తుది లక్ష్యం మాత్రం అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికల్లో లబ్ధి పొందడమే అనేది బహిరంగ రహస్యం. ఈ లక్ష్యం.. నెరవేరుతుందా, వ్రతం చెడినా ఫలితం దక్కుతుందా… అనేది ఇప్పుడున్న ప్రశ్న.
 
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అటు బిజెపి, జనసేనతో కలిసి పోటీ చేసింది. అంత చేసినా వైసిపి-టిడిపి మధ్య ఓట్ల తేడా ఐదారు లక్షలు మాత్రమే. అటువంటిది ఇప్పుడు ఆ రెండు పార్టీలూ దూరమయ్యాయి. పైగా అధికారంలో ఉన్నందువల్ల ఎంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. ఈ పరిస్థితుల్లో టిడిపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి గెలవడం అంత తేలికైన పని కాదు. వైసిపి-టిడిపి మధ్య ఓట్ల తేడా 10 శాతం దాకా ఉన్నట్లు సర్వేలు కూడా వచ్చాయి. ఇవన్నీ గమనంలో ఉంచుకునే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడ్డారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో 2.50 శాతం ఓట్లు దాకా వచ్చాయి. ఈ కాలంలో ఒకటి రెండు శాతం ఓట్లు పెరిగినా పెరిగి వుండొచ్చు. ఆ ఓట్లు కలిస్తే ఎన్నికల్లో గట్టెక్కవచ్చు అనేది టిడిపి ఆలోచన. అందుకే పార్టీ ఆవిర్భావం నుంచి ఏ పార్టీతోనైతే టిడిపి పోరాడితే అదే పార్టీతో పొత్తుకు సై అంది. ఇప్పుడు సమస్యంతా…. కాంగ్రెస్‌ ఓట్లు టిడిపికి బదిలీ అవుతాయా అనేదే..!
 
వైసిపి ఏర్పడిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ మొత్తంగా జగన్‌తో వెళ్లిందనడంలో సందేహం లేదు. కొందరు ఇతర పార్టీల్లోనూ చేరారు. ఇప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉన్నవారిని కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాదులని చెప్పాలి. ఏదిఏమైనా కాంగ్రెస్‌తోనే తమ ప్రయాణం అనుకునేవారు వీరు. అటువంటి వాళ్లు టిడిపితో కాంగ్రెస్‌ పొత్తును జీర్ణించుకోగలరా? తమ ఓట్లను టిడిపికి వేయగలరా? అనేది చర్చించాల్సిన అంశం.
 
కాంగ్రెస్‌ – టిడిపి పొత్తు టిడిపి కంటే వైసిపికి మేలు చేసే అవకాశాలూ లేకపోలేదు. కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాదులు టిడిపికి ఓటు వేయడం కంటే వైసిపికి వేయడం మంచిదని భావించడానికి అవకాశాలున్నాయి. ఎంత కాదన్నా వైసిపి అనేది కాంగ్రెస్‌ మూలాల నుంచి వచ్చిన పార్టీ. కాంగ్రెస్‌లో అందరి అభిమానం చూరగొన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు స్థాపించిన పార్టీ. బద్ధశత్రువైన టిడిపి వైపు కంటే జగన్‌ వైపు మొగ్గడానికే అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
 
భావసారూప్యత ఉన్న పార్టీల మధ్య పొత్తు పెట్టుకున్నప్పుడు ఓట్ల బదిలీ మామూలుగా జరిగిపోవచ్చుగానీ… దీర్ఘకాలం ఒకరితో ఒకరు కలహించుకుంటూ, ఘర్షణ పడుతూ, పోట్లాడుతూ సాగిన పార్టీల మధ్య అటువంటి బదిలీ జరగడం అంత తేలికకాదు. ఈ అంశానికి సంబంధించి ఎన్నికల ముగిసిన తరువాత కాంగ్రెస్‌ – టిడిపి మధ్య మాటల యుద్దాన్ని చూడొచ్చు. మీ ఓట్లు మాకు వేయలేదంటూ రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోక తప్పుదు.
 
ఇక నాయకుల విషయానికొస్తే… కాంగ్రెస్‌తోనే ఉంటే ఇప్పుడు కాకున్నా రేపటికైనా భవిష్యత్తు ఉంటుందని భావించారు. కాంగ్రెస్‌ ఒంటరిగా ఉంటే కనీసం పోటీ చేసే అవకాశం వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు టిడిపితో పొత్తు వల్ల 15 సీట్లు లోపే వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు ఆశావహులంతా ఏమవ్వాలి?
 
టిడిపితో పొత్తు వున్న తమకు సీటు వస్తుందన్న నమ్మకం ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఖుషీగా ఉన్నా…. మిగతా నాయకులు అంత ఉత్సాహంగా లేరు. వట్టి వసంతకుమార్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి వంటి వారు గతంలోనే తమ అభిప్రాయం చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటానని చెప్పారు. అటువంటి వారూ ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఎన్నికలు సమీపించే నాటికి కాంగ్రెస్‌ నుంచి వలసలు ఉంటాయనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు.