మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:38 IST)

పూల వ్యాపారి జన్‌ధన్ ఖాతాలో రూ.30 కోట్లు.. ఎలా?

కర్నాటక రాష్ట్రంలోని చెన్నపట్టణానికి చెందిన ఓ దంపతుల జంట పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈ పూల వ్యాపారి భార్య జన్‌ధన్ బ్యాంకు ఖాతాలో రూ.30 కోట్లు వచ్చిపడ్డాయి. అవి ఎక్కడ నుంచో వారికి తెలియదు. కానీ, బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి బ్యాంకు ఖాతాను సీజ్ చేసి... పరుగుపరుగునా పూల వ్యాపారి ఇంటికి వచ్చి ఆరా తీశారు. తమకు తెలియదని చెప్పడంతో వారు ఖంగుతిన్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటకలోని చెన్నపట్నానికి చెందిన బుర్హాన్‌, రీహానా బాను(30) పూల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే 2015లో రీహానా బాను.. జన్‌ధన్‌ యోజన పథకం కింద జీరో బ్యాలెన్స్‌ ఖాతాను భారతీయ స్టేట్ బ్యాంకులో ఖాతాను తెరిచింది. 
 
అప్పటినుంచి వారి ఖాతాలో కేవలం రూ.60 మాత్రమే నిల్వవుంది. కానీ, గతేడాది డిసెంబర్‌ 2వ తేదీన రాత్రి రీహానా ఖాతాలో రూ.30 కోట్లు జమ అయ్యాయి. దీంతో బ్యాంక్‌ అధికారులకు అనుమానం వచ్చి రీహానా ఇంటికి వచ్చారు. మీ ఖాతాలో రూ.30 కోట్లు ఎవరు జమ చేశారని బుర్హాన్‌ దంపతులను బ్యాంకు అధికారులు అడిగారు. అసలు అంత నగదు ఎలా జమ అయిందో తమకు తెలియదని బుర్హాన్‌ స్పష్టం చేశాడు. 
 
మీ బ్యాంకు ఖాతా వివరాలు ఎవరితోనైనా షేర్‌ చేసుకున్నారా? అని బ్యాంకు అధికారులు మరోసారి ప్రశ్నించగా.. అప్పుడు బుర్హాన్‌ తాను ఆన్‌లైన్‌లో చీర కొనుగోలు చేయగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి తన మొబైల్‌కు ఫోన్‌ చేసి.. మీకు రూ.14 లక్షల విలువ చేసే ఎస్‌యూవీ లాటరీలో తగిలిందని చెప్పినట్లు వెల్లడించారు. కారు బీమా కోసం డబ్బులు పంపాలని కోరగా, అంత డబ్బు లేదని చెప్పడమే కాదు, తన చెవి ఆపరేషన్ కోసం రూ.2 లక్షలు కావాలని అతన్ని బుర్హాన్‌ సహాయం కోరాడు. దీంతో ఆ వ్యక్తి.. బుర్హాన్‌ నుంచి భార్య బ్యాంకు వివరాలు తెలుసుకుని ఫోన్‌ కట్‌ చేసినట్టు తెలిపాడు. 
 
ఆ తర్వాత జనవరి నెలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుర్హాన్‌కు ఫోన్ చేసి.. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.30 కోట్లలో రూ.15 కోట్లు తనకు ఇవ్వాలని, మిగిలిన మొత్తం మీ వద్దే ఉంచుకోండి అని ఆ వ్యక్తి చెప్పినట్లు బుర్హాన్‌ తెలిపాడు. మొత్తానికి ఈ ఘటనపై చెన్నపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రీహానా అకౌంట్లో రూ.30 కోట్లు జమ చేసిన వ్యక్తి.. ఢిల్లీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.