బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (07:52 IST)

ఆర్థిక వ్యవస్థ సమర్థంగా నడిపే సత్తాలేని సర్కారు : రాహుల్ గాంధీ

పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపు విషయంలో భాజపా నేతృత్వంలో కేంద్ర సర్కారుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నడిపే తీరు తెలీక.. ఖజానాలో డబ్బుల్లేకనే ప్రజల జేబుల్లోంచి పెట్రోల్‌, డీజిల్‌ రూపేణా బలవంతంగా డబ్బులు లాక్కుంటున్నారని విమర్శించారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం కేరళలో పర్యటించిన ఆయన.. ఇక్కడి ఓ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పటికీ చమురు ధరలు ఎక్కువ ఉండడంపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు రాహుల్‌ సమాధానంగా ఈ విధంగా స్పందించారు.
 
నోట్ల రద్దు, జీఎస్టీ వంటి భాజపా అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, కొవిడ్‌తో ఆ పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే ప్రజల చేతికి డబ్బులిచ్చి వినియోగం పెంచాలని పేర్కొన్నారు. 
 
తద్వారా వినియోగం పెరిగి పన్ను వసూళ్ల ద్వారా డబ్బులు ఖజానాకు చేరుతాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందన్నారు. పన్ను రాబడి ఎలా పెంచాలో తెలీక ఖజానా ఖాళీ అవ్వడంతో.. ప్రభుత్వాన్ని నడిపేందుకు పెట్రోల్‌, డీజిల్‌ రూపంలో ప్రజల జేబుల్లోంచి నేరుగా లాక్కుంటున్నారు అని రాహుల్‌ విమర్శించారు.
 
అలాగే, పురుషుల కంటే మహిళలు చాలా శక్తిమంతమైనవారన్నారు. కానీ, వారికి తమ శక్తి ఎంతటిదో తెలియక మగవారి చేతిలో మోసపోతుంటారని అభిప్రాయపడ్డారు. 
 
ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపకుల కోరిక మేరకు మహిళల స్వీయరక్షణ కోసం ఉపయోగపడే ఓ మార్షల్‌ ఆర్ట్‌ టెక్నిక్‌ను రాహుల్‌ విద్యార్థినులకు నేర్పించారు. ఆ విధానంలో శక్తిని కూడగట్టుకున్నట్లుగానే మహిళలు ఎల్లప్పుడూ తమలోని నిగూఢ శక్తిని వెలికితీయాలని పిలుపునిచ్చారు.
 
ఈ సమాజం మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. తమ శక్తితో ఎదురవుతున్న ప్రతి సవాల్‌ను దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. సమాజంలో పురుషులు, మహిళలు సమానమని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో రాహుల్‌ విభేదించారు.